గాలిలో పెరిగిన సల్ఫర్ డయాక్సైడ్
పగటి పూట కూడా శబ్దకాలుష్యం
వెల్లడించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): దీపావళి అంటేనే నగరాలు, పట్టణాల్లో పటాకుల పండుగ. ఈ సారి దీపావళి పండుగకు హైదరాబాద్ నగరవాసులు పటాకులు, బాంబుల మోత మోగించారు. శబ్ద, వాయు కాలుష్యంలో హైదరాబాద్, ఢిల్లీతో పోటీపడింది. నగరంలో సోమవారం రాత్రి వాయు, శబ్దకాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగింది. పగటిపూట సైతం శబ్ద కాలుష్యం నమోదైనట్టు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) వెల్లడించింది.
గాలిలో ధూళి కణాల శాతాన్ని పేర్కొనే పీఎం 2.5, పీఎం 10 సాంద్రతలు రెండింటిలోను పెరుగుదల నమోదైనట్టు పీసీబీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. పీఎం -2.5 సాధారణ రోజుల్లో 37గా ఉండగా, సోమవారం 69గా నమోదైంది. ఇక పీఎం 10 సాధారణ రోజుల్లో 91గా ఉంటే, దీపావళి పండుగ రోజు 153గా నమోదైంది. పీఎం 2.5.. 86 శాతం, పీఎం 10.. 68 శాతం చొప్పు పెరిగాయి. ఇక గాలిలో సల్ఫర్డయాక్సైడ్ పరిహానం సాధారణ రోజల్లో 8 ఉంటే, పండుగ రోజున 17గా నమోదయ్యింది. 2024లో ఇది 14గా ఉంటే ఈ సారి 17కు పెరిగింది. నైట్రోజన్ ఆక్సైడ్ సాధారణ రోజుల్లో 26 ఉంటే, సోమవారం 30గా నమోదయ్యింది.
మోత మోగింది!
పారిశ్రామికవాడల్లో శబ్దకాలుష్యం పగటి పూట 62.8, రాత్రిపూట 55 డెసిబుల్స్గా ఉండగా, సోమవారం పగటిపూట 65.9, రాత్రి 61.6 డెసిబుల్స్గా నమోదైంది.
కమర్షియల్ ప్రాంతంలో శబ్ద కాలుష్యం సాధారణ రోజుల్లో పగటి పూట 61.48, రాత్రి 57.11 డెసిబుల్స్ ఉండగా.. సోమవారం పగటి పూట 64.05, రాత్రి 61.08 డెసిబుల్స్గా నమోదైంది.
నివాస ప్రాంతాల్లో (రెసిడెన్షియల్ జోన్)లో శబ్ద కాలుష్యం సాధారణ రోజుల్లో పగటి పూట 62.39, రాత్రిపూట 57 డెసిబుల్స్ ఉంటే, దీపావళి రోజున పగటిపూట 64.03, రాత్రిపూట 60.68 డెసిబుల్స్గా నమోదైంది.
