అమరావతి : కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసినట్లు వెల్లడించారు. శెట్టి బలిజల పితామహుడిగా పేరుగాంచిన వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలని నిర్ణయించడంపై సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు ఆమె ధన్యవాదాలు తెలియ చేశారు. కోనసీమ ప్రాంతానికి చెందిన దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టి బలిజ సమాజంలో విద్య, ఐక్యత, ఆత్మ గౌరవం కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప సంస్కర్తని కొనియాడారు.
విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పి, సామాజిక చైతన్యానికి బాటలు వేశారన్నారు. కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వయోజన విద్యకు కృషి చేసిన మేధావి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్తు తరాలకు తెలియ జేయాలన్న లక్ష్యంతో దొమ్మేటి జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని అప్పట్లో మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఇక నుంచి ప్రతి ఏటా మార్చి 23న దొమ్మేటి వెంకట్ రెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు.
The post అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంకట్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
