తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రంలలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నారాయణగిరి ఉద్యాన వనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఊంజల్ సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టి గానంతో సప్తగిరులు పులకించాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ మఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజీ అనుగ్రహ భాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్య పీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు. అన్నమయ్య విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే సాగిందని చెప్పారు. అహోబిలం శ్రీ నరసింహ స్వామివారి అనుగ్రహంతో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు దీక్ష పొంది మంత్రోపదేశం పొందారని వివరించారు. ఈ మంత్రోపదేశంలోని 32 బీజాక్షరాలతో అన్నమయ్య 32 వేల సంకీర్తనలు రచించారన్నారు.
అనంతరం అహోబిల మఠం తరఫున శ్రీ తాళ్లపాక అన్నమయ్య విగ్రహానికి వస్త్రం సమర్పించారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వామీజీని శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ అన్నమాచార్యుల వర్ధంతిని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరమన్నారు. 1975లో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుండి దాదాపు మూడు వేల సంకీర్తనలను రికార్డు చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేసినట్లు చెప్పారు. అమెరికా దేశంలోని దాదాపు వెయ్యి ఆలయాల్లో అన్నమాచార్యుల సంకీర్తనలను గానం చేస్తున్నారన్నారు. అన్నమాచార్యులు పామరులకు కూడా అర్థమయ్యే భాషలో సంకీర్తనలు రచించారని తెలిపారు. ప్రస్తుత ఆధునిక సమాజానికి అన్నమయ్య సంకీర్తనలు ఎంతో అవసరం ఉందని అన్నారు.
అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన వివిధ సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టు కున్నాయి. సింగపూర్, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భజన బృందాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం టీటీడీ తరఫున తాళ్లపాక వంశీయులను అదనపు ఈవో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్, డైరెక్టర్ లత, ఇతర అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
The post అన్నమయ్య సంకీర్తనలు పులకించిన సప్తగిరులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
