అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణ పనులపై క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షకు హాజరయ్యారు మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తోన్న సంస్థల ప్రతినిధులు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశాల్లో రూ.57,821 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయి. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించి పనులు చేపట్టింది సీఆర్డీఏ. నాటికి నేటికి నిర్మాణ వ్యయం పెరగడం సహా పలు సవాళ్లను అధిగమించి టెండర్లు పూర్తి చేసి పనులు అప్పగించింది.
ప్రస్తుతం అమరావతి రాజధానిలో పనులు చేస్తున్నారు 20 వేల మంది కార్మికులు, నిపుణులు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది..? టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం సమీక్ష చేపట్టారు. ఎంత మంది కార్మికులు పని చేయాలి, ఎంత మంది పనిచేస్తున్నారు… ఎంత మిషనరీ ఉపయోగించాలి, ఎంత ఉపయోగిస్తున్నారు అనే విషయంపై సమగ్రంగా చర్చించారు నారా చంద్రబాబు నాయుడు. వారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు .వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను వివరించారు ఉన్నతాధికారులు. రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దని, ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టేనని భావించాలని స్పష్టం చేశారు సీఎం.
The post అమరావతి రాజధాని నిర్మాణం పనులు వేగవంతం చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
