అసత్య కథనాలు రాస్తే ఖండన కోరవచ్చు: టీయూడబ్ల్యూజే 143
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేయడా న్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీయూడబ్ల్యూజే 143 అధ్యక్షుడు అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్, తెమ్జు అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ రమణకుమార్, కోశాధికారి పీ యోగానంద్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాసర్‌తో కలిసి పత్రికాప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టులు నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఖండన కోరవచ్చు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని.. ఇలా అర్ధరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదని హితవు పలికారు. సీనియర్ జర్నలిస్టుల అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడించారు.
పాత్రికేయులను బలిచేయవద్దు ; సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్ హితవు
ఇటీవల కొన్ని చానల్స్‌లో మంత్రులు, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా కించపరిచేలా కొన్ని కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగా చానల్స్‌లో వచ్చిన వార్తలపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిట్ వేసి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. కాగా మంగళవారం అర్ధరాత్రి ఎన్‌టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేశ్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్ స్పందించారు. ‘అధికార పక్షం అంతర్గత క్రీడలో పాత్రికేయులను బలిచేయవద్దు. ఆ ముగ్గురు జర్నలిస్టులను వెంటనే విడిచి పెట్టాలి’ అని సీనియర్ ఎడిటర్ కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అసలు కారకులు ఎవరో తేల్చాలి ; జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలి సీనియర్ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఎన్టీవీ చానల్‌లో ప్రసారమైన కథనం కేసులో వరింగ్ జర్నలిస్టులను బలి పశువులు చేయవద్దని, తక్షణమే వారిని విడుదల చేయాలి అని సీనియర్ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ నాయకుల అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరులో వృత్తి ధర్మంలో భాగంగా విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను బలి చేయవద్దని సూచించారు. ఈ వార్తల వ్యాప్తికి మూలం ఎవరు.. బయటకు రావడానికి అసలు కారకులు ఎవరు అనేది బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
పోలీసుల చర్య సహించరానిది ; జర్నలిస్టులను విడుదల చేయాలి టీయూడబ్ల్యూజే డిమాండ్
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): విచారణ పేరుతో మంగళవారం అర్ధరాత్రి ఎన్టీవీ జర్నలిస్టుల ఇండ్లపై పోలీసులు దాడులు జరిపి, భయాందోళనలకు గురిచేసి ముగ్గురు జర్నలిస్టులను అక్రమంగా అదుపులోకి తీసుకోవడం సహించరానిదని, ఈ చర్యను తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) తీవ్రంగా పరిగణిస్తున్నదని టీయూడబ్ల్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రాంనారాయణ, ఉప ప్రధానకార్యదర్శి కే రాములు పేర్కొన్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ కార్యాలయంపై పోలీసులు దాడి జరిపి అలజడి సృష్టించడం విచారకరమని పేర్కొన్నారు. జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర స్థాయిలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
అభ్యంతరాలు ఉంటే ఖండించాలి ; హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్‌కుమార్ రెడ్డి
మీడియాలో వచ్చే కథనాలను ఆధారంగా చేసుకుని పోలీసు చర్యలకు పాల్పడటం సరికాదని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ విజయ్‌కుమార్ రెడ్డి అన్నారు. ప్రసారమైన కథనంలో అభ్యంతరాలు ఉంటే ఖండించి, చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అంతేగాని వృత్తి విలువలు పాటించే జర్నలిస్టుల విషయంలో అనైతికంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
