హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు కేంద్రంలోని మోదీ బీజేపీ సర్కార్ పై. కావాలని పేదలకు పనికి వచ్చే పథకాలను అన్నింటిని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమ పార్టీ ఆధ్వర్యంలో గతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కోట్లాది మంది పేదలకు మేలు చేకూర్చేలా తీసుకు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు.
మహాత్మాగాంధీ పేరుతో నాటి యూపీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం పేరు మార్చి, ఉద్దేశాన్ని నీరుగార్చి పేదలకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని పునరుద్ధరించే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యచరణ తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని చెప్పారు. ఈ పథకంలో మార్పులను నిరసిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపామని తెలిపారు సీఎం. ఈ పథకాన్ని యదాతథంగా పునరుద్ధరించాలన్న డిమాండ్ తో ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని నిర్ణయించామన్నారు. ఫిబ్రవరి మూడు నుండి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి.
మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తల కష్టం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాం అన్నారు. ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత మా పైన ఉందన్నారు.
The post ఉపాధి పథకాన్ని యథాతథంగా అమలు చేయాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
