నిర్మల్ చైన్‌గేట్, అక్టోబర్ 25 : ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) ఓటర్ల జాబితాను పకడ్బందీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2002లో రూపొందించిన ఎస్‌ఐఆర్ జాబితాను 2025 ఎస్‌ఐఆర్ ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని హెచ్చరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్వోలు, డిప్యూటీ తహసీల్దార్లు, బీఎల్వో సూపర్‌వైజర్లతో నిరంతర సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్‌కుమార్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సర్పరాజ్ పాల్గొన్నారు.
పారదర్శకంగా పూర్తి చేయాలి..
ఎదులాపురం, అక్టోబర్ 25 : రాష్ట్రంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను కచ్చితత్వం, పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని చాబ్రా పాల్గొన్నారు.
