మంచిర్యాల, జనవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అసత్య ప్రచారంతో నిరుద్యోగులను మభ్యపెట్టి… ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టి.. అధికార అందలమెక్కిన కాంగ్రెస్ అసలురంగు తెలిసిన విద్యావంతుల నుంచి ఆగ్రహజ్వాల వెల్లువెత్తుతున్నది. బీఆర్‌ఎస్ హయాంలో వరుస నోటిఫికేషన్లు వచ్చినా.. కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మిన యువతీయువకులు హస్తం పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలే తప్ప… కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఏంటో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. కొందరు తమ మనోవేదననంతా సామాజిక మాధ్యమాల వేదికగా వెళ్లగక్కుతుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ వీడియో వైరల్‌గా మారింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి కన్నీటిగాథ ప్రతిఒక్కరినీ కదిలిస్తున్నది. తెలంగాణలో సగటు నిరుద్యోగి ఆవేదనకు అద్దం పడుతున్నదని, ఇదీ రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి అంటూ నిరుద్యోగులు, తెలంగాణవాదుల మద్దతుతో ఆ వీడియో వైరల్‌గా మారింది.
అన్ని రంగాలు అధోగతి..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా హామీలు అమలుకు నోచుకోవడంలేదని వీడియోలో నిరుద్యోగి ఆవేదన వ్యక్తంచేశాడు. నమ్మించి ముంచిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు నిరుద్యోగుల తరఫున పిలుపునిచ్చాడు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కోరాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనే మార్పు కనిపించిందని చెప్పాడు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడా అభివృద్ధి పనులు జరగడం లేదని, అవినీతి, నియంత పాలన నడుస్తున్నదని, ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వివరించాడు. వ్యవసాయ రంగం దెబ్బతిన్నదని, సరియైన సమయంలో పెట్టుబడి సాయం, ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఉద్యోగాలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని ప్రశ్నించాడు.
చెన్నూర్‌లో పడకేసిన పాలన
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వైఫల్యాలను వివరిస్తూనే… తన సొంత నియోజకవర్గమైన చెన్నూర్‌లో నెలకొన్న దుస్థితిని నిరుద్యోగి ప్రత్యేకంగా వివరించాడు. కాంగ్రెస్ పార్టీ, చెన్నూర్ ఎమ్మెల్యే, మంత్రి వివేక్‌పై విమర్శలు గుప్పించాడు. నియోజకవర్గంలో రెండేళ్లలో తట్టెడు మట్టి ఎత్తి పోసిన దాఖలాలు లేవని విమర్శించాడు. కుమారుడి ఎంపీ టికెట్, మంత్రి పదవి, జూబ్లీహిల్స్ ఎన్నికలపైనే దృష్టి పెట్టిన వివేక్.. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు పట్టించుకోలేదని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ పెద్దఎత్తున నిధులు తెచ్చి, చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. ప్రజల సమస్యలు పట్టకుండా ఎన్నికల కోసమే వచ్చే వివేక్.. ఎన్నికల తర్వాత హైదరాబాద్‌కు సూట్‌కేసులు పట్టుకొని పోతారని నిప్పులు చెరిగాడు. దందాలు, ఢిల్లీకి సూట్‌కేసులు పంపేందుకే చెన్నూర్‌లో పోటీ చేశారని ఆరోపించారు. చెన్నూర్‌లో ప్రజల పరిస్థితి ఘోరంగా ఉన్నదని, మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించాలని చెప్పారు. నియోజకవర్గ నిరుద్యోగ యువకుడి ఆవేదనతో కూడిన వీడియో స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
