‘కాంతార’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు పొందారు కన్నడ అగ్ర హీరో రిషబ్ శెట్టి. దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ పానిండియా రికార్డులను అధిగమిస్తూ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ సినిమా 500కోట్ల మార్క్‌ని దాటడం విశేషం. రిషబ్ శెట్టిలోని దర్శకుడికీ, నటుడికీ దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన విలేకరులతో ముచ్చటించారు..
స్వతహాగా నాకు జానపద కథలు ఇష్టం. ఇండియా జానపద కథలకు నిలయం. ఈ సినిమా విజయంతో మరిన్ని జానపద కథలు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ‘కాంతార’ మా ప్రాంతంలో నిజంగా జరిగిన కథ. అందుకే అక్కడే సినిమా తీశాను. ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. తెరకెక్కించడం నిజంగా పెద్ద ఛాలెంజ్. నిర్మాణంలో ప్రతి రోజూ ఓ ఛాలెంజ్‌గానే గడిచింది. ఈ సినిమా కోసం మా ప్రాంతంలో ప్రత్యేకమైన స్టూడియోను కూడా ఏర్పాటు చేశాను. చిన్నప్పట్నుంచీ మా ఊళ్లో సినిమా చేయాలని నా కోరిక. అది ‘కాంతర’ ఫ్రాంచైజీతో నెరవేరింది. మా ఊరివాళ్లంతా ఈ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. నేను స్టార్‌గా ఎదిగినా నాలోని దర్శకుడ్నే ఇష్టపడతాను. దర్శకత్వానికే తొలి ప్రాధాన్యతనిస్తాను.
అజనీష్ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి అదనపు బలం. ట్రైబల్ ఏరియాలకు వెళ్లి అక్కడి ఒరిజినల్ స్కోర్‌ని రికార్డ్ చేసి, ఈ సినిమాకు ఉపయోగించాడు. హోంబలే వారు ఇచ్చిన సపోర్ట్ కూడా సాధారణమైనది కాదు. నిర్మాతలుగానే కాక, వ్యక్తిగతంగా కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వారి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ‘కాంతార: చాప్టర్ 1’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా. తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని జనవరి నుంచి ‘జై హనుమాన్’ షూటింగ్‌లో జాయిన్ అవుతా. దర్శకుడిగా కొన్ని కథల్ని సిద్ధం చేస్తున్నా.
