న్యూఢిల్లీ, అక్టోబర్ 25: కొటక్ మహీంద్రా బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,253 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.3,344 కోట్ల లాభంతో పోలిస్తే 3 శాతం పడిపోయింది.
సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.15,900 కోట్ల నుంచి రూ.16,239 కోట్లకు ఎగబాకినట్టు బీఎస్‌ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల మీదనే రూ.13,649 కోట్లు ఆర్జించింది. అలాగే నికర వడ్డీ ఆదాయం రూ.7,311 కోట్లకు చేరుకోగా, నికర వడ్డీ మార్జిన్ 4.54 శాతంగా నమోదైంది. మరోవైపు, బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.49 శాతం నుంచి 1.39 శాతానికి దిగిరాగా, అలాగే నికర ఎన్‌పీఏ కూడా 0.43 శాతం నుంచి 0.32 శాతానికి తగ్గాయి.
