అమరావతి : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. సినీ రంగంలో నటుడిగా చెరగని ముద్ర వేశారు. నటుడిగా మాత్రమే కాకుండా రచయితగా, దర్శకుడిగా, స్టంట్ కోఆర్డినేటర్ గా, కొరియోగ్రాఫర్ గా, గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రజా నాయకుడిగా మన్ననలు పొందారు. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యులైన పవన్ కళ్యాణ్, ఓ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ అరుదైన ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది.
సినిమాలు, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభమైంది. కరాటే , సంబంధిత యుద్ధకళల పట్ల అమితమైన ఆసక్తి కలిగిన పవన్ కళ్యాణ్, చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి, సాంకేతికంగా , తాత్వికంగా బలమైన పునాది ఏర్పరుచుకున్నారు. కాలక్రమేణా, శారీరక సాధనకే పరిమితం కాకుండా, జపనీస్ సమురాయ్ మార్షల్ సంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేసి, పరిశోధించి, అత్యంత నిబద్ధతతో వాటిని అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్ పై ఆయన అవగాహన సినిమాల రూపంలోనూ ప్రతిబింబించింది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, తమ్ముడు, ఖుషి, అన్నవరం, ఓజీ వంటి చిత్రాల ద్వారా ఈ మార్షల్ కళలను తెరపై ప్రదర్శిస్తూ, వాటికి విస్తృత గుర్తింపు, ప్రజాదరణ తీసుకొచ్చారు.
మార్షల్ ఆర్ట్స్ పట్ల ఆయన చూపిన నిరంతర, దీర్ఘకాలిక అంకితభావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు, పవన్ కళ్యాణ్‌కు పలు ప్రతిష్ఠాత్మక గౌరవాలు అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధకళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటైన ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఆయనకు ఫిఫ్త్ డాన్ (ఐదవ డాన్) పురస్కారం లభించింది. అలాగే, జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా ఆయన నిలిచారు. ఇది జపాన్ వెలుపల చాలా అరుదుగా లభించే గౌరవం.
The post జపనీస్ మార్షల్ ఆర్ట్స్‌లో గుర్తింపు పొందిన పవన్ కళ్యాణ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
