నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య హెచ్చరిక
వినాయక్‌నగర్, అక్టోబర్ 12: దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసే వారు తప్పకుండా సంబంధిత డివిజన్ స్థాయి పోలీస్ అధికారుల అనుమతి తీసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా దుకాణాలను ఏర్పాటు చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
పాటించాల్సిన నిబంధనలివి..
టపాకాయల షాపులను ఏర్పాటు చేసేవారు ఖాళీ ప్రదేశాలు, కల్యాణ మండపాల్లో ఏర్పాటు చేసి,అక్కడి వారి నుంచి ఎన్‌వోసీ పొందాలని పేర్కొన్నారు.
ప్రతి దుకాణానికి మధ్య మూడు మీటర్ల దూరం, రెసిడెన్షియల్/గృహనిర్మాణలకు 50 మీటర్ల దూరం ఉండాలి.
ఒక్కో ప్రాంతంలో(క్లస్టర్‌లో) 50 షాపులకు మించి ఏర్పాటు చేయకూడదు.
రద్దీ ఉన్న ప్రదేశాల్లో టపాకాయల షాపులను ఏర్పాటు చేయకూడదు.
తాత్కాలిక టపాకాయల దుకాణాల్లో ఫైర్‌కు సంబంధించి జాగ్రతలు తప్పక పాటించేలా చర్యలు తీసుకోవాలి.
షాపుల ఏర్పాటు కోసం దరఖాస్తు ఫారంలో పూర్తి వివరాలు నమోదు చేసి, సంబంధిత ఏసీపీ కార్యాలయంలో అందజేసి, అనుమతి పొందాల్సి ఉంటుం దనిదని సీపీ సూచించారు.
