నీటి మూటగా కాంగ్రెస్ సర్కారు ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీ
దీపావళి గడువు ముగిసినా ఆ ఊసే ఎత్తని రేవంత్ ప్రభుత్వం
నవంబర్ 3 నుంచి సమస్యలపై నిరవధిక సమ్మెకు ‘ఫతి’ పిలుపు
హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): దసరాకు రూ. 600 కోట్లు, దీపావళికి మరో రూ. 600 కోట్లు ఇస్తామని సమ్మెకు దిగిన కాలేజీలకు సర్కారు పెద్దలు ఇచ్చిన హామీలు నీటి మూటలే అయ్యాయి. తొలుత రూ. 200 కోట్లు ఇచ్చి వారిని శాంతపరిచిన ప్రభుత్వం మిగతా రూ. 1,000 కోట్లలో దీపావళి నాటికి రూ.300 కోట్లు ఇస్తామని రెండోసారి హామీ ఇచ్చింది. చివరికి దీపావళి వెళ్లిపోయినా ఆ హామీ కూడా నెరవేరలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న దగాకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు మళ్లీ సమ్మెబాట పట్టాయి. నవంబర్ 3 నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సర్కారు రూ.10 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో బకాయి పడింది. వీటిని విడుదల చేయకపోవడంతో సెప్టెంబర్15 నుంచి కాలేజీలు మూసేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీంతో దిగివచ్చిన సర్కారు రెండు విడుతల్లో బకాయిలను విడుదల చేస్తామని అంగీకరించింది. వాస్తవానికి 10 వేల కోట్లల్లో రూ.600 కోట్లు అంటే కేవలం 6 శాతం మాత్రమే. అయినా కాలేజీ యాజమాన్యాలు బంద్‌ను విరమించుకున్నాయి. కానీ సర్కారు పెద్దలు మాత్రం ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. మొదట డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబులు చర్చలు జరిపారు. రూ.1200 కోట్లను విడుదలచేస్తామని హామీనిచ్చారు. తీరా రూ. 300 కోట్లకు కుదించి, చివరకు అది కూడా ఇవ్వలేకపోయారు.
ప్రత్యామ్నాయం చూపించినా..
రాష్ట్రంలో 1500కు పైగా ప్రొఫెషన్ కాలేజీలున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ రూపంలో వాటికి బకాయి పడిన రూ. 10 వేల కోట్లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఏకతాటిపైకి వచ్చాయి. వేర్వేరుగా పోరాడిన ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్ కాలేజీల యాజమాన్యాలు ఈ ఏడాది జూన్‌లో ఫెడరేషన్ ఆఫ్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఇనిస్టిట్యూషన్స్ (ఫతి)గా ఏర్పడ్డాయి. ఇకపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించాయి. టోకెన్లు జారీచేసిన ఫీజు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అయితే సర్కారు నుంచి కనీస స్పందన కరువైంది. ఈ నేపథ్యంలో ఫతి ప్రతినిధులు జూలై 7న సరికొత్త ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను సర్కారుకు సమర్పించారు. లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా ట్రస్ట్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ముందు ప్రతిపాదించారు. ఈ లక్ష కోట్లల్లో సర్కారు వాటా పరిమితమేనని, సీఎస్సార్, కార్పస్‌ఫండ్ వంటి ఇతర మార్గాల ద్వారా వచ్చిన డిపాజిట్లపై ఏడుశాతం వడ్డీ (సుమారు 3 వేలకోట్లు) ఫీజు రీయింబర్స్ చేయవచ్చని సూచించారు. దీనిపై ఉలుకులేదు పలుకులేదు. ఒక వైపు బకాయిలు విడుదల చేయకపోవడం, మరో వైపు ప్రత్యామ్నాయ ప్రణాళికను ఖాతరు చేయకపోవడంతో సెప్టెంబర్ 12న కాలేజీల యాజమాన్యాలు సమావేశయ్యాయి. సర్కారుపై సమరానికి సిద్ధపడ్డాయి.
ఎప్పుడు ఏం జరిగిందంటే..
సెప్టెంబర్ 15 నుంచి కాలేజీల నిరవదిక బంద్‌కు ఫతి పిలుపునిచ్చింది. బకాయిలు విడుదలయ్యే వరకు కాలేజీలను మూసివేయాలని, విద్యాసంస్థలన్నింటికీ మూకుమ్మడిగా తాళాలు వేస్తామని ప్రకటించింది. సీఎస్, విద్యాశాఖ అధికారులు, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను కలిసి నోటీసులు అందజేసింది.
యాజమాన్యాల హెచ్చరికలకు సర్కారు ఉలిక్కిపడ్డది. సెప్టెంబర్ 13న ప్రభుత్వం ఫతి ప్రతినిధులతో ప్రాథమిక చర్చలు జరిపింది. ఈ చర్చలు విఫలమయ్యాయి. పలు వర్సిటీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
కాలేజీ బంద్‌పై యాజమాన్యాలు వెనక్కితగ్గలేదు. సెప్టెంబర్ 21లోపు టోకెన్లు విడుదలైన బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 31లోపు 50 శాతం, డిసెంబర్ 31లోపు మొత్తం బకాయిలను విడుదల చేయాలని గడువుగా విధించారు. పైగా సెప్టెంబర్ 23 లేదా 24 తేదీల్లో చలో హైదరాబాద్‌ను నిర్వహిస్తామని సెప్టెంబర్ 14న ఫతి ప్రకటించింది.
సెప్టెంబర్ 15న యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. వారంలో రూ. 600 కోట్లు విడుదల చేస్తామని, దీపావళికి మరో రూ. 600 కోట్లు విడుదల చేస్తామని హామీనిచ్చింది. ఈ హామీతో కాలేజీలు బంద్‌ను విరమించాయి.
ప్రభుత్వం చెప్పిన వారం గడిచింది. దసరా పోయింది. రూ. 600 కోట్లు కాదు కదా, ఆరు రూపాయలు కూడా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఫతి ప్రతినిధులు ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది.
సెప్టెంబర్ 30న సమావేశమైన ఫతి ప్రతినిధులు మళ్లీ నిరవదిక బంద్‌కు సిద్ధపడ్డారు. అక్టోబర్ 12లోగా బకాయిలను విడుదల చేయాలని సర్కారుకు గడువుగా విధించారు. వెయ్యికోట్ల బకాయిలను విడుదల చేయకపోతే అక్టోబర్ 13న నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చారు. ఆఖరుకు రూ. 200 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
కాలేజీలు బంద్‌కు పిలుపునివ్వడంతో అక్టోబర్ 7న సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఫతి ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీపావళి కల్లా రూ. 300 కోట్లు విడుదల చేస్తామని హామీనిచ్చారు. అంత వరకు సమ్మెను వాయిదా వేయాలని కోరగా, అక్టోబర్ 13 నుంచి జరగాల్సిన సమ్మెను యాజమాన్యాలు వాయిదావేశాయి.
దీపావళి హామీని సర్కారు నిలబెట్టుకోలేకపోయింది. ఈ నెల 19న సమావేశమైన ఫతి ప్రతినిధులు నవంబర్ 3 నుంచి కాలేజీలను నిరవదికంగా బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వానికి నోటీసును అందజేయనున్నారు. ఈ నెల 24న అక్రిడెటెడ్ కాలేజీ యాజమాన్యాలతో, 25న విద్యార్థి సంఘాలతో సమావేశమై మద్దతు కోరనున్నారు.
