అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాజమాన్యాలు భద్రతాపరమైన నిబంధనలు పాటించక పోవడమే వేట్లపాలెం బాణసంచా తయారీ యూనిట్లోపేలుడు ప్రమాదానికి కారణమని చెప్పారు. జాతరలు, పండుగలు ఉండడంతో పరిమితికి మించి కూలీలను పనికి పెట్టుకున్నారని తెలిపారు. 8 మంది పని చేసేందుకు అనుమతి ఉన్న ప్రదేశంలో 31 మంది చేత పని చేయిస్తుండడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని చెప్పారు. కాకినాడ జీజీహెచ్ లో వేట్లపాలెం పేలుడు ఘటన మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించారు. ఘటన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడారు.
సామర్లకోట మండలం, వేట్లపాలెం వద్ద బాణసంచా తయారీ యూనిట్ లో జరిగిన ప్రమాదంలో 20 మంది మృతి చెందగా, 9 మంది గాయపడ్డారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అని పేర్కొన్నారు. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదన్నారు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. సీఎంతో నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించామన్నారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాం అని తెలిపారు. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చుల ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.
The post నిబంధనల ఉల్లంఘనలే ప్రమాదానికి కారణం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
