రైతులారా.. భూ యజమానులారా బహుపరాక్
22ఏ జాబితాలోకి భారీగా భూములు
గతంలో 15 లక్షల ఎకరాలుండగా
ఇప్పుడు ఏకంగా కోటి ఎకరాల చేరిక
విచారణ లేదు.. రైతుల అభిప్రాయం లేదు
ఇష్టారీతిగా నిషేధిత జాబితాలో చేర్చిన వైనం
రైతులు, భూ యజమానులకు తీవ్ర నష్టం
అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా కళ్లెం
నిషేధిత భూ సమస్యలు పరిష్కరిస్తామని
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ
ఇప్పుడేమో భారీగా నిషేధిత జాబితాలోకి
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలు (Congress Leaders)సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను (Prohibited Lands)చేర్చిందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిషేధిత భూముల జాబితాను రెవెన్యూ శాఖ సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. పట్టా భూములు సైతం నిషేధిత జాబితాలో ఉన్నాయని చెప్తూ సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పూర్తిస్థాయిలో నిషేధిత జాబితా(22ఏ), పార్ట్-బీ భూముల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించింది.
దీంతో రెవెన్యూ శాఖ అధికారులు మూడు నెలలుగా ఇదే పనిలో నిమగ్నం అయ్యారు. ఇటీవలే జిల్లాలవారీగా 22ఏ, పార్ట్-బీ భూముల జాబితా సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ జాబితాలో గతానికి మించి, భారీ మొత్తంలో భూములను చేర్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇష్టానుసారం సర్వేలు చేసి ప్రభుత్వానికి సంబంధం లేని, ఎలాంటి వివాదం లేని భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా కోటి ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరినట్టు రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ జాబితాను త్వరలో సబ్‌రిజిస్ట్రార్లకు అందించి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నట్టు తెలిసింది.సాధారణంగా ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్, అటవీ భూములను నిషేధిత జాబితాలో చేర్చుతుంటారు.
వీటితో పాటు వివాదాస్పద భూములు, న్యాయవివాదాల్లో ఉన్న భూములను కూడా ఇదే కోవలో పరిగణిస్తారు. రెవెన్యూశాఖ ఇటీవల సిద్ధం చేసిన జాబితాలో ప్రభుత్వానికి సంబంధించిన భూములతోపాటు ఎలాంటి వివాదాలు లేని ప్రైవేట్, పట్టా భూములను కూడా భారీగా చేర్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలా కోటి ఎకరాల పట్టామార్పిడిపై నిషేధం విధించనున్నట్టు సమాచారం. బీఆర్‌ఎస్ హయాంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి తెచ్చిన సమయంలో నిషేధిత జాబితాలో సుమారు 20 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు విచారణ జరిపి ఇందులో నుంచి 3 లక్షల ఎకరాలను తొలగించారని అంటున్నారు. తాము అధికారంలోకి వస్తే భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు వాటిని తగ్గించకపోగా కోటి ఎకరాలకు పెంచినట్లు తెలిసింది. నిషేధిత జాబితాలో చేర్చడంతో ఈ మొత్తం భూములపై క్రయవిక్రయాలు పూర్తిగా నిలిచిపోతాయి. అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా పోతుంది. వారసత్వ మార్పిడి కూడా చేయలేని దుస్థితి ఏర్పడుతుంది. చివరికి పెట్టుబడి సహాయం కూడా అందదు. అంటే రైతులకుగానీ, భూ యజమానులకు గానీ ఆ భూమితో ప్రయోజనం శూన్యం.
ఇష్టానుసారంగా జాబితా?
నిషేధిత భూముల జాబితా తయారీలో రెవెన్యూశాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతులు, భూ యజమానుల నుంచి ఎలాంటి విచారణ లేకుండానే రెవెన్యూ అధికారులు ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్టు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించిన సంగతి తెలిసిందే. భూ సమస్యల పరిష్కారం కోసమంటూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించింది. ఈ సందర్భంగా రైతులు అనేక కారణాలు చూపుతూ తోటి రైతులపై ఫిర్యాదులు చేశారు. వీటిపై రెవెన్యూ అధికారులు సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను గుర్తించి పరిష్కరిస్తారని అప్పట్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అధికారులు ఏ ఒక్క గ్రామంలోనూ క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన దాఖలాలు లేవని రైతులు అంటున్నారు.
తమ వద్ద ఉన్న వివరాలు, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులు, పోర్టల్ ద్వారా అందిన ఫిర్యాదుల ఆధారంగా నిషేధిత జాబితా రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు పైఅధికారుల ఒత్తిడే కారణమని క్షేత్రస్థాయి అధికారులు చెప్తున్నారు. తమ పీకలపై కత్తి పెట్టి జాబితా రూపొందించేలా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమ భూ సమస్యలు తగ్గుతాయని ఆశపడితే రెట్టింపయ్యాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిష్కరిస్తామని చెప్పి గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. రెవెన్యూ సదస్సుల పేరుతో గ్రామాల్లో హడావుడి చేశారని, అయినా వాటితో కూడా ప్రయోజనం లేదని చెప్తున్నారు. పైగా రెవెన్యూ సదస్సుల్లో ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుపకుండానే, ఆయా భూములను వివాదాస్పద భూములుగా ప్రకటించి, నిషేధిత జాబితాలో చేర్చినట్టు సమాచారం.
మళ్లీ మధ్యవర్తులు రంగంలోకి..
‘కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను బంగాళాఖాతంలో పడేస్తామని చెప్తున్నది. దాని స్థానంలో భూమాత పోర్టల్ ప్రవేశపెడతామని అంటున్నది. వాళ్లు తెస్తున్నది భూమాతనా.. భూ మేతనా? ధరణిని పక్కన పెడితే భూముల రికార్డులు ఆగమవుతాయి. మళ్లీ మధ్యవర్తులు మోపైతారు. దళారుల రాజ్యం మొదలవుతుంది’ అని అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పదే పదే హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఒక భూమి లేదా ఒక సర్వే నంబర్ ఒక్కసారి నిషేధిత జాబితాలో చేరిందంటే ఇక అంతే సంగతి. దాన్ని ఆ జాబితా నుంచి తొలగించడం రైతులకు అంత సులభం కాదు. ఇదే అదునుగా రూ.కోట్ల విలువైన భూములను అగ్గువకు కొల్లగొట్టే కుట్రలు చేస్తారని, సెటిల్మెంట్ల పేరుతో రూ.కోట్లు కొట్టేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ధరణి పోర్టల్ అమల్లో ఉన్న సమయంలో అధికారులకు విచక్షణ అధికారాలు లేవు. భూ రికార్డులను మార్చేందుకు వారికి అవకాశం ఉండేది కాదు. దీంతో మీ సమస్య పరిష్కరిస్తాం అంటూ మధ్యవర్తులు, దళారులు వచ్చే అవకాశమే లేకుండా పోయింది.
అక్రమ దందాలకు చెక్ పడింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అడ్డుగోడను తొలగించింది. ధరణి స్థానంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టి, భూమాత పోర్టల్‌ను అమలు చేసినప్పటి నుంచి అధికారులకు విచక్షణ అధికారాలను కట్టబెట్టింది. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోని పరిస్థితులు మళ్లీ పునరావృతం అవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యవర్తులు, దళారులు పుట్టుకొస్తారని నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగిస్తామనే పేరుతో రైతుల, భూ యజమానుల నుంచి రూ.లక్షలు, కోట్లు దండుకుంటారని ఆరోపిస్తున్నారు. వివాదాస్పద భూముల పేరుతో అగ్గువకు రైతులనుంచి కాజేస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా అధికార కాంగ్రెస్ నేతల కోసం సృష్టించిన ఒక అవకాశం అని, నేతలే దళారుల అవతారం ఎత్తుతారని స్పష్టం చేస్తున్నారు. ఒప్పందాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వ పెద్దల సాయంతో ఆ జాబితా నుంచి భూములను తొలగించి, లేదా బలవంతంగానో బెదిరించో తమ అనుయాయులకు కట్టబెట్టేందుకు తెరవెనుక కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టార్గెట్ జీహెచ్‌ఎంసీ?
కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని భూములపై కన్నేశారన్నది బహిరంగ రహస్యం. ఇప్పటికే అడ్డగోలుగా కబ్జాలు, సెటిల్మెంట్లు, ప్రభుత్వ, దేవాదాయ భూములను కాజేయడం వంటి ఘటనలు నిత్యకృత్యం అయ్యాయి. మంత్రుల స్థానంలో ఉన్నవారే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మరిన్ని భూములను కొల్లగొట్టేందుకు నిషేధిత భూముల జాబితాను అస్త్రంగా వినియోగించుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల పరిధిలో పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు, పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్టు ప్రచారం జరుగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో నాలుగువేల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిని బట్టే ఏ స్థాయిలో నిషేధిత జాబితా తయారయ్యిందో అర్థం చేసుకోవచ్చన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ భూములన్నింటికీ ఎసరు పెడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రహస్యంగా ‘భూమాత’లోకి
ఇప్పటికే నిషేధిత భూముల జాబితా సిద్ధమైనా, అధికారులు ఎక్కడా ఆ వివరాలు వెల్లడించడం లేదు. ఈ జాబితాను అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో ప్రభుత్వం, అధికారుల తీరుపై రెవెన్యూ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జాబితాను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నిస్తున్నారు. ఈ జాబితాను నేరుగా భూమాత పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది. అంతకుముందే జాబితాలను గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లలో బహిరంగంగా ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్నారు. తద్వారా ఎవరి భూమి, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో ఉన్నదో తెలుసుకునే వెసులుబాటు కలుగుతుందని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి రెవెన్యూశాఖ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులారా..భూ యజమానులారా బహుపరాక్..మీ భూమి మీ పేరుపైనే ఉన్నదా? నిషేధిత జాబితాలో చేరిందా?
ఓసారి చెక్ చేసుకోండి
ఎందుకంటే కాంగ్రెస్ సర్కారు కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ కోటి ఎకరాల్లో మీ భూమి కూడా ఉండే ప్రమాదమున్నది. సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో ఏకంగా 4 వేల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టినట్టు తెలిసింది. బీఆర్‌ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 20 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా రేవంత్ సర్కారు ఏకంగా నాలుగింతలు పెంచి కోటి ఎకరాలను అమ్మడానికి, కొనడానికి వీల్లేకుండా కళ్లెం వేసింది.దీని వెనుక ప్రభుత్వం మరో భారీ భూ కుంభకోణానికి తెరలేపుతున్నదా? ‘నిషేధితం’ పేరిట కోట్ల విలువైన భూములను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నదా? అందుకే ఇష్టారాజ్యంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందా? ముఖ్యంగా హైదరాబాద్, చుట్టు పక్కల ప్రాంతాలపై గురిపెట్టిందా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి రెవెన్యూ వర్గాలు!
