మూడేండ్లలో ఇవ్వాల్సిన మొత్తం నిధులు రూ. 15,600 కోట్లు
ఈ ఏడాదికి రూ. 3,020 కోట్లు అవసరం కాగా ఇచ్చింది పది కోట్లు
78 రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు
14 స్కూళ్లకే పూర్తయినటెండర్లు.. మరో 62 పెండింగ్
రూ. 8 వేల కోట్ల అప్పు కోసం అధికారుల విశ్వ ప్రయత్నాలు
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల (YIRS) పరిస్థితి ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టుగా తయారైంది. ఈ స్కూళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3,020 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు రూ.10 కోట్లు మాత్రమే కేటాయించారు. వీటిలో ఖర్చుచేసింది రూ.ఆరు కోట్లే. దీంతో వీటి నిర్మాణం విషయంలో ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.మూడు వేల కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.ఎనిమిది వేల కోట్లు, 2027-28లో రూ.ఐదువేల కోట్లు ఇస్తేనే వీటి నిర్మాణం సాకారమవుతుంది. ఈ లెక్కన ఇప్పటినుంచి నెలకు కనిష్ఠంగా రూ.250 కోట్లు, గరిష్ఠంగా రూ.878 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో జిల్లా మినరల్ ట్రస్ట్ ఫండ్ (DMFT) నిధులను వీటి కోసం మళ్లిస్తున్నారు. సింగరేణి సహా ఇతర మైనింగ్ కంపెనీల ద్వారా సమకూరిన వాటిలో రూ.450 కోట్లను 10 జిల్లాల్లో ఖర్చు చేసేందుకు రంగం సిద్ధంచేశారు.
బాలరిష్టాల్లోనే..
రాష్ట్రంలో మొత్తం 78 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ సూళ్ల నిర్మాణానికి (Young India Schools) ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇవి బాలారిష్టాలు దాటడంలేదు. జనవరిలోనే అనుమతులు ఇవ్వగా, ఇప్పటివరకు 14 స్కూళ్ల నిర్మాణానికి మాత్రమే టెండర్లు పూర్తయ్యాయి. మధిర, కొడంగల్, కొల్లాపూర్, హుస్నాబాద్, షాద్‌నగర్ వంటి కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. మరో 62 యంగ్ ఇండియా స్కూళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఆయా టెండర్లు కమిషనర్స్ ఆఫ్ టెండర్స్ (సీవోటీ) వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. మరో రెండింటికి స్థల సేకరణే జరగలేదు. చాంద్రాయగుట్ట, శేరిలింగంపల్లిలో నిర్మించనున్న స్కూళ్లకు స్థల సేకరణ సమస్యగా మారింది. కానీ, ప్రభుత్వం మాత్రం 30 నెలల్లో వీటిని పూర్తిచేయాలని గడువు విధించింది. 2025 జూన్‌లో ఈ 78 గురుకులాల నిర్మాణం పనులు ప్రారంభించి, 2027 నవంబర్ నాటికి నిర్మాణాలు పూర్తిచేయాలన్నది లక్ష్యం. వీటి నిర్మాణానికి రూ.16 వేల కోట్లు అవసరం కాగా, రూ.8వేల కోట్ల అప్పు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ పరిస్థితి
మొత్తం మూడు దశల్లో 78 యంగ్ ఇం డియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించాల్సి ఉన్నది. మొదటిదశలో మూ డు, రెండో దశలో 11, మూడో దశలో 64 చొప్పున నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నది.
మొదటి విడతలో నిర్మించే మూడు యంగ్ ఇండియా స్కూళ్లను 20 నెలల్లో పూర్తిచేయాలని గడువు పెట్టుకున్నారు. వీటి నిర్మాణం పనులు జూన్ 2025లో ప్రారంభించి, 2027 జనవరి కల్లా నిర్మాణం పూర్తిచేయాలన్నది లక్ష్యం.
రెండో విడతలో 11స్కూళ్లను నిర్మించాల్సి ఉండగా, వీటిని 21 మాసాల్లో పూర్తిచేయాలని గడువు పెట్టుకున్నారు. ఆగస్టు 2025 లో వీటి నిర్మాణం ప్రారంభించి, 2027 ఏప్రిల్‌లోగా పూర్తిచేయాలని నిర్దేశించారు.
మూడోవిడతలో 64 స్కూళ్లను నిర్మించాల్సి ఉండగా, 27 నెలల్లో వీటిని పూర్తిచేయాలని గడువు పెట్టుకున్నా రు. 2025 సెప్టెంబర్‌లో నిర్మాణం ప్రారంభించి, 2027 నవంబర్‌లోగా నిర్మించాలని నిర్దేశించారు.
