హైదరాబాద్ : లా అండ్ ఆర్డర్ ను కాపాడడంలో పోలీసులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఆయన అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించారు. సాంకేతికత వినియోగంలో నగర పోలీసులు మరో ముందడుగు వేశారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) సిబ్బంది విధుల కేటాయింపులో మానవ ప్రమేయం లేకుండా, పూర్తి పారదర్శకతతో కూడిన అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానానికి శ్రీకారం చుట్టారు. బషీర్‌బాగ్ లోని పాత కమిషనర్ కార్యాలయంలో సజ్జనార్ ప్రారంభించి ప్రసంగించారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో విధుల కేటాయింపు వల్ల జాప్యం జరగడంతో.. సమయం చాలా వృథా అయ్యేదన్నారు. వాటికి చెక్ పెడుతూ కేవలం రెండు నెలల్లోనే ఈ కొత్త సాంకేతికతను హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీతో కలిసి జనరేటివ్ ఏఐ సాయంతో కొత్త విధానాన్ని ఉన్నతాధికారులు అభివృద్ధి చేశారని చెప్పారు.
హంగేరియన్ మెథడ్’ అనే సాంకేతిక పద్ధతి ద్వారా సిబ్బంది సీనియారిటీ, రిజర్వ్‌లో ఉన్న రోజులు, రివార్డులు, క్రమశిక్షణ, ఆరోగ్యం వంటి అంశాలను స్కోర్ ఆధారంగా పరిగణనలోకి తీసుకొని కంప్యూటరే విధులను ఖరారు చేస్తుందన్నారు వీసీ సజ్జనార్. ఇందులో అధికారుల జోక్యం అస్సలు ఉండదన్నారు.ఓపెన్ ఏఐ సాయంతో డ్యూటీ అలాట్‌మెంట్ ఆర్డర్‌లు క్షణాల్లో తయారవుతాయని చెప్పారు సజ్జనార్. దీనివల్ల ఆఫీసు పనిభారం తగ్గి, పోలీసులు శాంతి భద్రతలపై మరింత దృష్టి పెట్టేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక ‘ఏఐ చాట్ బాట్’ అందుబాటులో ఉంటుందన్నారు. డ్యూటీ అలాట్‌మెంట్ కు సంబంధించిన అన్ని విషయాలకు సమాధానం ఇస్తుందన్నారు సిటీ పోలీస్ కమిషనర్.
ఈ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కింద 1,796 దరఖాస్తులను పరిశీలించి.. సెక్రటేరియట్, సీఎం ఆఫీస్, ట్రాఫిక్ తదితర విభాగాలతో పాటు ఇంటర్‌సెప్టర్ వాహనాలకు సంబంధించిన 208 డ్యూటీలను సమర్థంగా కేటాయించడం జరిగిందన్నారు. పోలీస్ సిబ్బందికి విధుల కేటాయింపును పారదర్శకంగా, జవాబుదారీతనంతో మార్చడం కోసమే అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ విధాన రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీకి చెందిన త్రినాథ బాబుని, సునీల్ రేగులని ఈ సందర్బంగా అభినందించారు.
The post పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
