ఇంటి పెరట్లో పెంచే మొక్కల్లో ‘బిళ్ల గన్నేరు’ ముందుంటుంది. తెలుపు, గులాబీ వర్ణాల్లో చూడముచ్చటైన పూలు పూస్తుంది. అయితే.. ఈ మొక్క ఇంటికి అందాన్ని ఇవ్వడంతోపాటు మనకు ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుంది. ఈ మొక్కను శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వాడుతున్నారు. అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడానికి దీనిని ఉపయోగిస్తున్నారు.
మధుమేహాన్ని తగ్గించడంలో బిళ్ల గన్నేరు పూలు దివ్యౌషధమేనని ఆయుర్వేదం చెబుతున్నది. ఇందులోని ప్రత్యేక లక్షణాలు.. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సాయపడతాయి. బిళ్ల గన్నేరు పూల రేకుల్ని నమిలితే.. షుగర్ తగ్గుముఖం పడుతుంది.
బిళ్ల గన్నేరు మొక్కలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. చెడు కొవ్వును కరిగిస్తాయి. గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి.
గాయాలు, పుండ్లను తగ్గించడానికీ బిళ్ల గన్నేరును వాడవచ్చు. మొక్క ఆకులకు కాస్త పసుపును కలిపి మెత్తగా నూరాలి. ఆ మిశ్రమాన్ని గాయాలకు రాస్తే.. త్వరగా మానుతాయి.
బిళ్ల గన్నేరు పూలు.. నెలసరి సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి. ఓ గుప్పెడు పూలను ఓ గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగితే.. నెలసరి నొప్పులతోపాటు రక్త స్రావం కూడా తగ్గుతుంది.
