నంద్యాల జిల్లా : మహిళా సాధికారతతో సమాజ అభివృద్ధి సాధ్యమని జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు విజయ రహత్కర్ అన్నారు. శ్రీశైలంలోని దేవస్థాన కార్యనిర్వహణాధికారి కార్యాలయం లోని మీటింగ్ హాల్ నందు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన “సమాజ పురోగతిని మహిళల అభివృద్ధితోనే అంచనా వేయాలి” అనే సూక్తిని ప్రస్తావిస్తూ, మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా 550 జిల్లాల్లో ‘మహిళా జనసునావి’ కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమాల ద్వారా గృహ హింస, బలవంతపు శ్రమ, వృద్ధ మహిళలపై దౌర్జన్యాల వంటి అంశాలపై నేరుగా ఫిర్యాదులను స్వీకరించి పరిష్కార చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022 ఏప్రిల్ 4న ఏర్పడిన నంద్యాల జిల్లా పరిపాలన, ఆర్థిక , సామాజిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 2025 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 20.27 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలు నమోదై, వాటి విలువ రు.1.09 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో డిఎపి ఎరువుల వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో నిలవడం విశేషమని పేర్కొన్నారు. ఈ విజయాల్లో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు.
The post మహిళా సాధికారతతో సమాజ అభివృద్ధి సాధ్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
