అమరావతి : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు ధురంధర్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కల్నాయక్ గా మారాడని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అని ఆరోపించారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై తల్లి ప్రేమ చూపిస్తూ, విశాఖ స్టీల్‌పై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. మిట్టల్ స్టీల్ కోసం భారీగా వరాలు ఇచ్చారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయంటే ఎవరు కాదనరు. కానీ మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. 15 ఏళ్ల పాటు రాష్ట్ర వాటా కింద జీఎస్టీని మినహాయింపు ఇవ్వడం దారుణమన్నారు షర్మిలా రెడ్డి. ఎలక్ట్రిసిటీ కింద యూనిట్‌కు 1 రూపాయి మాఫీనా ఇదేనా ప్రజా ప్రభుత్వం అంటే అని నిలదీశారు.
ఛత్తీస్ గడ్ లోని బైలడిల్లాలో ఐరన్ ఓర్ కేటాయింపులు, రవాణాకు సొంత పోర్ట్ , పైప్ లైన్ కి అన్ని అనుమతులు , వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెళ్లే నీళ్లను మళ్లింపులు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్‌పై ఇంత శ్రద్ధ ఉంది కానీ.. అదే ప్రేమ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ పైన ఎందుకు లేదు? బైలడిల్లా నుంచి మిట్టల్ ప్లాంట్ కి ముడిసరుకు పంపిస్తే విశాఖ స్టీల్ పరిస్థితి ఏంటి ? విద్యుత్ సబ్సిడీలు, సొంత పోర్ట్ లు విశాఖ ఉక్కుకు వద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 35 వేల మంది ఉద్యోగాలు చేసే మన వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై ఎందుకు అంత చిన్న చూపు? విశాఖ ఉక్కుమీద ఇంకా ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదు అని ఒక్కరంటే ఒక్కరు కూడా హామీ ఇవ్వలేదు. మిట్టల్ అంటే ఎందుకు మీకు అంత ప్రేమ? వైజాగ్ స్టీల్‌పై ఎందుకంత కోపం?కేంద్రంలో బీజేపీ వచ్చాక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీజం పడిందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను వెంటనే SAILలో విలీనం చేయాలని, లేదంటే మిట్టల్‌కు కల్పించిన రాయితీలు స్టీల్ ప్లాంట్‌కూ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తొలగించిన 17 వేల మందిని వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అన్నారు.
The post మిట్టల్ స్టీల్‌కు 25 వేల కోట్ల రాయితీలా ? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
