తిరుపతి : రాయలసీమ ఎత్తి పోతల పథకం నిలిపి వేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. మంగళవారం తిరుపతి డీపీఆర్ కళ్యాణ మండపంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం చంద్రబాబు మోసం అనే కార్యక్రమం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు , మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాయలసీమ రైతులు, ప్రజల శాశ్వత నీటి సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఉద్దేశ పూర్వకంగా నిలిపి వేయడం వెనుక చీకటి ఒప్పందం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో రహస్య ఒప్పందం చేసుకుని రాయలసీమ నీటి హక్కులను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు రూ.2000 కోట్లు అవసరమని చెప్పి నిధులు లేవని తప్పించుకుంటూ, ప్రజలకు ఇచ్చిన హామీలకు డబ్బులు లేవని చెబుతూ, తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రం డబ్బులు దోచుకుంటూ జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. అదే సమయంలో అమరావతి నిర్మాణానికి మాత్రం భారీగా నిధులు సమీకరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.
ఎన్నో దశాబ్దాలుగా కష్టాల సాగు చేస్తున్న రాయలసీమ రైతాంగాన్ని ఈ ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో రైతుల గుండెల్లో ఆవేదన రగులుతోందని పేర్కొన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోతిరెడ్డి పాడు ద్వారా రాయలసీమకు నీటిని అందించి రైతులకు నూతన జీవం పోశారని, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేశారని గుర్తుచేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనులు 87 శాతం పూర్తయ్యాయని, కానీ ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కావాలనే ఈ ప్రాజెక్టును నిలిపి వేసిందని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, అందులో ఎక్కువ మంది రాయలసీమ ప్రాంతానికి చెందిన వారేనని ఆవేదన వ్యక్తం చేశారు.రాయలసీమ గడ్డపై పుట్టి, ఇక్కడి నీళ్లు తాగి, ఇక్కడి రైతులు పండించిన ఆహారం తిన్న నాయకులు ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం సరికాదని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వెంటనే పునః ప్రారంభించి పూర్తి చేయాలని, లేకపోతే రాయలసీమ ప్రజలు తీవ్రంగా స్పందిస్తారని హెచ్చరించారు. అలాగే రాయలసీమకు నీటి హక్కు సాధన కోసం త్వరలోనే నీటి అంశంపై పాదయాత్ర ప్రారంభించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా భూమాన కరుణాకర్ రెడ్డిని కోరారు.
The post రాయలసీమ నీటి హక్కుపై చీకటి ఒప్పందం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
