ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రెండేండ్ల పాలనలో ఆ పార్టీయే మర్చిపోయినట్లుంది. తమకు రుణ మాఫీ కాలేదని మొత్తుకున్న రైతులు ఆశలు వదులుకొని మిన్నకున్నారు. ఆసరా పింఛన్ల పెంపు, కల్యాణలక్ష్మిలో తులం బంగారం ఉత్త ముచ్చటే అయిందని అర్హులు అర్థం చేసుకున్నారు. ఇలా చెప్పుకోవాలంటే.. ఇప్పుడు కాంగ్రెస్ హామీల ఏమార్పు ఓ వొడవని ముచ్చట.
అభివృద్ధిలో అమెరికాతో పోటీ పడుతున్నానంటూ.. కాని పనులతో గాలిమేడలు కడుతున్న రేవంత్‌రెడ్డి.. ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారు. అయితే ఆ హామీల అమలులో జరుగుతున్న విపరీతమైన జాప్యానికి కడుపుమండిన జనం.. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇటీవల నిరసనల దగడు పరాకాష్టకు చేరిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. రేవంత్ సర్కార్, కాంగ్రెస్ తల దించుకునేలా నడిబజారులో ఒక వింతైన ఫ్లెక్సీ వెలిసింది.
రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, కరీంనగర్ జిల్లా పేరిట ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార సందర్భంగా దీనిని కరీంనగర్‌లోని ఓ ఇంటి గేటుకు ప్రదర్శించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ ఇల్లు 2024లో రిటైరైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిది. 23 నెలలు గడిచినా మాకు పెన్షన్ బకాయిలు ప్రభుత్వం ఇవ్వలేదు. బకాయిలు రాక మానసిక వేదనతో రాష్ట్రంలో 61 మంది రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. అందుకే.. కాంగ్రెస్ వారికి ఓటు అడిగే హక్కు లేదు. దయచేసి అర్థం చేసుకోగలరు.’ అని ఫ్లెక్సీపై ఉన్నది. ఎవరు చదివినా మనస్తాపం చెందే వాక్యాలివి.
కరీంనగర్‌లోని ప్రధాన వీధిలో ఉన్న ఒక ఇంటి గేటుకు పెద్ద సైజులో పెట్టిన ఈ ఫ్లెక్సీ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిలువుటద్దం. తమ సంఘం తరఫున ప్రదర్శించిన ఈ నిరసనపై ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ప్రతిస్పందన ఏమిటి? ఈ ఫ్లెక్సీ ఏర్పాటు విషయాన్ని పార్టీ అధిష్ఠానం వద్దకు తీసుకెళ్లారా? ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదు అని బాహాటంగా అన్న విషయంపై మౌనంగానే ఉన్నదంటే ఆ పార్టీ తమ వైఫల్యాన్ని ఒప్పుకున్నట్టే కదా! ఒకవేళ ఈ ప్రదర్శనను రిటైర్డ్ ఉద్యోగుల వేదనగా ప్రభుత్వ వర్గాలు అర్థం చేసుకుంటే వెంటనే తీసుకొనే చర్యలేమిటి? తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఆరంభం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల దౌర్భాగ్యానికి నిదర్శనంగా, ఆగ్రహ సూచికగా నిలిచిన ఈ ఫ్లెక్సీ నుంచి ప్రభుత్వం ఎంతో ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉన్నది.
రెండేండ్లుగా రిటైర్డ్ ఉద్యోగుల కష్టాలు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలతో ప్రజల వరకు వస్తున్నాయి. ముదివయసులో వందలమంది వీధుల్లోకి వచ్చి, తమకు ప్రభుత్వం నుంచి రావలసిన కోట్లాది రూపాయల బకాయిల గురించి ఏకరువు పెడుతున్నారు. విశ్రాంత ఉద్యోగులుగా ఇంటిపట్టున ఉండి, కాలం గడపవలసివారు నిరాహార దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టినా రేవంత్‌రెడ్డి మనసు కరగడంలేదు. రాష్ట్రంలో రాజకీయ విపక్షాలు ఎన్ని ఉన్నా ప్రణాళికాబద్ధమైన ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ మెడలు వంచడం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై ఈ మధ్య ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టు పత్రికల్లో వచ్చింది. వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోతే హైదరాబాద్ నడిమధ్యన దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ మాటపై ఆ నేత ఎంతవరకు నిలబడతారో చూడాలి.
2024 మార్చి నుంచి నేటివరకు సుమారు 13 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించలేదు. వీరికి దాదాపు రూ.12 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. ప్రతి నెల కొత్తగా మరో 8 వందల మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. ఈ ఆర్థిక భారాన్ని వాయిదా వేసేందుకు ప్రభుత్వం పదవీ విరమణ వయసును 63 ఏండ్లకు పెంచే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న యువత నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర తుందన్న భయంతో ఈ ఆలోచన బయట పెట్టడం లేదని సమాచారం.
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ తప్ప మిగతా సొమ్మేదీ వారి ఖాతాలో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తమవుతున్నది. డీఏ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఇలా లక్షల రూపాయల చెల్లింపులు నిలిచిపోయాయి. ఒక ఫ్లెక్సీతో కండ్లు తెరవని ప్రభుత్వానికి బుద్ధివచ్చేలా ప్రతి విశ్రాంత ఉద్యోగి ఇంటి ముందు ఇలాంటి నిరసన కనబడాలి. రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వం బూటకపు హామీలతో నష్టపోయినవారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. వారంతా కూడా ఇలాంటి నిరసనలో భాగం కావలసిన అవసరం వచ్చింది.
– బద్రి నర్సన్
