నంద్యాల జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం వల్ల రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసేసిందని ఆరోపించారు. డోన్ లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం 1.95 కోట్ల ఎకరాలను 22ఏలో పెట్టారని, ప్రైవేట్ భూముల్ని ఇష్టానుసారంగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన భూమి ఇవ్వకపోతే వాటిని 22ఏలో పెట్టేసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారని పేర్కొన్నారు.
అప్పీల్ కు వెళ్లడానికి వీలు లేకుండా చేయాలని చూశారని అన్నారు సీఎం . ఇదే జిల్లాలో పాణ్యం నియోజకవర్గంలో పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చానని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. భూ రికార్డుల్లో తప్పులను సరిదిద్దుతున్నాం అని చెప్పారు. వారసత్వంగా వచ్చిన భూములు, సొంత శ్రమతో కొనుగోలు చేసిన భూములకు చెందిన పుస్తకాలపై ఫోటోలు వేసుకున్నారని ఇదెక్కడా దేశంలో లేదన్నారు. ఫోటోల పిచ్చితో జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. సర్వే రాళ్లపైనా ఫోటోలు ముద్రించుకున్నారని, ఈ ఒక్క దాని పిచ్చి కోసం రూ.750 కోట్లు ఫోటోలకు ఖర్చు చేశారని ఆరోపించారు .
The post రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
