అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, సీఎస్ కె. విజయానంద్ సహా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిరంతరం అందిన సహకారంతో గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి బయట పడిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం రోజుకు 19,401 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి చేస్తోందని ఆ ప్లాంట్ సీఎండీ ముఖ్యమంత్రికి వివరించారు. 2024-25 రెండో త్రైమాసికంలో రోజుకు కేవలం 9,215 టన్నుల హాట్ మెటల్ ను మాత్రమే ఉత్పత్తి చేయగలిగామని తెలిపారు.
ప్రస్తుతం మూడు బ్లాస్ట్ ఫర్నెస్ లు పూర్తిగా పని చేస్తుండటంతో ఉత్పత్తి భారీగా పెరిగిందని సీఎంకు తెలియచేశారు. స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్ లో రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరుకుందని తెలిపారు. గత ఏడాది 45 శాతం మాత్రమే ఉత్పత్తి సామర్ధ్యంతో పని చేయగలిగామని అన్నారు. పన్నులు, విద్యుత్ బకాయిలు, నీటి సరఫరా లాంటి వేర్వేరు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారంతో ఆర్ధికంగా నష్టాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల దశకు చేరుకుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.11,440 కోట్ల సాయంతో స్టీల్ ప్లాంట్ నిలదొక్కుకుని మంచి ఫలితాలు సాధిస్తుందని చెప్పారు. 2026 జనవరిలో రూ.54 కోట్లు లాభాన్ని ఆర్జించ గలిగామని తెలియ చేశారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్ కు క్రెడిట్ రేటింగ్ కూడా పెరిగినట్టు స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అన్ని విభాగాల్లోనూ నూతన విధానాలను ప్రవేశపెట్టి స్టీల్ ప్లాంట్ ను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. కార్మికుల, ఉద్యోగులు, అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే ఈ విజయం సాధ్యం అయ్యింది అన్నారు.
The post లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్రబాబు నాయుడు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
