Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

విదేశీ స్కాలర్‌షిప్‌లతో సర్కార్‌ చెలగాటం

Ai generated article, credit to orginal website, February 13, 2026

ఆలస్యం అమృతం విషం అన్న సూక్తి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు విడుదల చేయడంలో మాత్రం యథార్థం. ముఖ్యంగా Overseas education scheme కింద దరఖాస్తు చేసుకొని నాటి కేసీఆర్‌ ప్రభుత్వం నుంచి మంజూరు పత్రాలు పొంది, రేవంత్‌రెడ్డి సర్కార్‌ ప్రభుత్వంలో స్కాలర్‌షిప్‌ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల విషయంలో ఇది రూఢీ అయింది. అమెరికా తదితర దేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లిన విద్యార్థులకు ముఖ్యంగా ట్రంప్‌ విధానాలు, ఇక్కడ మన ప్రభుత్వం ఉదాసీనతతో అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు.
గత మూడేండ్లుగా అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసి రెసిషన్‌ వల్ల ఉద్యోగాలు పొందలేక, మళ్లీ ఇతర కోర్సుల్లో జాయిన్‌ అవుతూ అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారు విదేశీ విద్యాపథకం కింద వెళ్లిన విద్యార్థులు. అక్కడ తిప్పలు పడుతూ నిరాశ నిస్పృహల్లో భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు లేనందున, నెలవారీ ఖర్చుల కింద ఇక్కడి వారి తల్లిదండ్రులు బ్యాంకుల్లో బంగారం కుదువబెట్టి, బంధుమిత్రుల వద్ద చేయగలిగినంత అప్పు చేస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. కొండవీటి చాంతాడులా అప్పు పెరిగిపోతుంటే, గత నెల పాలకులు కనికరించి, విద్యార్థులకు మంజూరైన రూ.20 లక్షల్లో పాతిక భాగం అంటే ఐదు నుంచి ఏడు లక్షల వరకు వారి ఖాతాల్లో జమ చేశారు. కానీ ఇవే డబ్బులు రెండేండ్ల కిందటే వేస్తే అప్పు తాలూకు వడ్డీ భారం ఎంతో తగ్గి ఉండేది.
రాష్ట్ర సర్కార్‌ నిధులు జమచేసినా ప్రయోజనం లేకపోయింది. కారణం.. అభ్యర్థులు అమెరికాలో ఉన్నత చదువులకు కేవలం యూనివర్సిటీ ఫీజుకే 40 నుంచి 60 లక్షల వరకు ఆయా బ్యాంకుల నుంచి రుణం తీసుకొన్నారు. రెండేండ్ల ఎంఎస్‌ కోర్సు అయ్యాక వర్క్‌ పర్మిట్‌ పొందినప్పటికీ ఉద్యోగాలు లేక అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఇటీవల అమెరికా ప్రభుత్వం హెచ్‌-1 బీ వీసాలను ఏకంగా 2027 మార్చి వరకు ఇవ్వరాదని నిషేధించింది. దాంతో విద్యార్థుల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. ఆ దేశ నిబంధనల ప్రకారం విదేశీ విద్యార్థులు స్టూడెంట్‌ వీసా మీద ఉండరాదు. ఆర్థికమాంద్యం వల్ల కంపెనీలు ఉద్యోగ ప్రకటనలే చేయడం లేదు. అమెజాన్‌ వంటి కంపెనీలే భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తుండటంతో సర్వత్రా అభద్రతాభావం నెలకొన్నది. విద్యార్థులు ఉద్యోగాలు రాకపోవడంతో మరో కోర్సులో చేరుతున్నారు. దాంతో అప్పు మరింత అధికమవుతుండడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది.
కేసీఆర్‌ సర్కార్‌ 2023లో విదేశీ విద్యా పథకం కింద అర్హులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఆ తర్వాత వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మొదటి విడతగా అక్టోబర్‌ 2025లో ఒక్కొక్క విద్యార్థికి దాదాపు రూ.7 లక్షల చొప్పున అందించడంతో అవి వేడి పెనం మీద నీళ్లు చల్లినట్లయి, బ్యాంకు వడ్డీ చెల్లింపులకే సరిపోయింది. అసలు రుణం సర్పంలా బుసలు కొడుతున్నది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో మిగతా రూ.13 లక్షలను కూడా రెండవ విడతగా అందించి ఆదుకోవాలని విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు. ఈ డబ్బులు సకాలంలో ఇస్తే కనీసం బ్యాంకు రుణాలను తీర్చుకోవాలని విద్యార్థులు భావిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలు రాక స్వదేశానికి రావలసి వస్తే, వారికి తొలుత అప్పులే స్వాగతం చెప్తాయి. రుణాల తాలూకు నెలసరి వాయిదాలు యమపాశాలవుతున్నాయి. నిధుల విడుదలలో ఆలస్యం అయితే విద్యార్థుల భవితవ్యమే ప్రశ్నార్థకమవుతుంది.
మున్సిపల్‌ ఎన్నికలు ముగిసిన అనంతరం రైతు భరోసా నిధులు విడుదల చేస్తానని సీఎం వాగ్దానం చేశారు. కానీ విదేశీ విద్యా పథకం కింద నిరుడు ఇవ్వాల్సిన నిధుల గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం విచారకరం. 2025 ఏప్రిల్‌లో బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ.100 కోట్లు మంజూరు చేసినప్పటికీ అక్టోబర్‌ 2025 వరకు కేవలం రూ.25 కోట్లు మాత్రమే అందించారు. మిగిలిన రూ.75 కోట్లను సత్వరమే విడుదల చేసి, ఆదుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
– డాక్టర్‌ వీవీ రామారావు 98492 37663

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • నిబంధ‌న‌లు పాటించ‌క పోతే సీజ్ చేస్తాం
  • నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది
  • సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి
  • కిమ్ వారసురాలిగా కిమ్ కూతురు
  • పాకిస్తాన్ సూప‌ర్ లీగ్ లో ఆడ‌బోం : ఆఫ్గ‌నిస్తాన్

Recent Comments

No comments to show.

Archives

  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes