మేడారం : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. పదవీకాలం పూర్తయిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు చేపట్టాలంటూ సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో గడువు పూర్తయిన 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, వాటి పరిధిలోని 2,996 వార్డులు, డివిజన్లకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది. ఇదిలా ఉండగా చరిత్రలో మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ వెలుపల మేడారం సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన మేడారంలో జరిగిన ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక సమర్పించడం, రిజర్వేషన్లు కూడా ఖరారవడం, అలాగే ఫిబ్రవరిలో రంజాన్, శివరాత్రి పండుగలతో పాటు చివరి వారం నుంచి వివిధ స్థాయిల్లో విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో, సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు పూర్తి చేయాలని మంత్రిమండలి స్పష్టం చేసింది. మేడారం జంపన్న వాగులో నిరంతరం నీరు ఉండే విధంగా రామప్ప, లక్నవరం నుంచి గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించేందుకు సంబంధించి రూ. 143 కోట్లు మంజూరు చేసింది. ములుగు జిల్లాలో కొత్తగా పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను కేబినెట్ ఆమోదించింది. రామప్ప చెర్వు నుంచి నీటిని లిఫ్ట్ చేసి ములుగు జిల్లాలోని 5 గ్రామాలు, 30 చెర్వులు కుంటలను నింపడంతో పాటు.. 7500 ఎకరాల ఆయకట్టు కు నీటిని అందించనుంది.
మేడారం పుణ్యక్షేత్రం కోసం ఇప్పటికే 19 ఎకరాల భూ సేకరణ పూర్తి కాగా, మరో 20 లేదా 21 ఎకరాల భూమిని సేకరించి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని మంత్రిమండలి తీర్మానించింది. 2027 జూలై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను సమగ్ర ప్రణాళికతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని పురాతన ప్రసిద్ధ దేవాలయాలను ఒక సర్క్యూట్ కింద ఆలయాల అభివృద్ధి, ఎకో-టూరిజం దృష్టితో నివేదిక అందించేందుకు ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయించారు.మార్చి 31 నాటికి కన్సల్టెన్సీ అందించే నివేదికపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, మేడారంలో చేపట్టిన తరహాలోనే దేవాలయాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసి, పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని మంత్రిమండలి తీర్మానించింది. హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లే-అవుట్ వరకు సుమారు 9 కి.మీ. మేరకు కొత్త రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది.
The post వీలైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
