శ్రీశైలం : శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శ్రీశైలంలో మంత్రులు ఆనం రామ నారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. గత ఏడాది తరహాలోనే ఈ సంవత్సరం కూడా భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 14, 15 తేదీలలో రెండు రోజుల పాటు టోల్ గేట్ల వద్ద వాహనాలకు ఉచిత అనుమతి ఇవ్వాలని సూచించారు. రాత్రి వేళల్లో ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించాలని ఆదేశించారు. సాక్షి గణపతి వద్ద రహదారి విస్తరణకు అవసరమైన స్థలాన్ని అటవీ శాఖ అందించినందున, సంబంధిత అధికారులు తక్షణమే రహదారి పనులు చేపట్టాలని సూచించారు. శ్రీశైలానికి వచ్చి వెళ్లే ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నామన్న భావనతో తిరిగి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా తరలివచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సేవల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించి, తగిన స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్కు సూచించారు. ఉత్సవాల సమయంలో సున్నా ఘటనలు (Zero Incidents) జరిగేలా అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు.
The post శ్రీశైలంలో భద్రతా చర్యలు చేపట్టాలి : వంగలపూడి అనిత appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
