ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని నిర్వహంచే కళ్యాణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏప్రిల్ 1న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు రానున్నారని తెలిపారు. ఇందులో భాగంగా శ్రీ కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సమర్పించే పట్టు వస్త్రాల కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో మురళీకృష్ణ ఏర్పాట్ల వివరాలను మంత్రి ఎస్. సవితకు వివరించారు. సవిత మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శ్రీ కోదండ రాముడి కళ్యాణోత్సవానికి దాదాపు లక్షకు పైగా భక్త బాంధవులు రానున్నారని , ముందస్తు ఏర్పాట్లు భారీగా చేయాలని సూచించారు మంత్రి సవిత. ఈ సందర్బంగా టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని, అన్ని శాఖల తో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామని తెలిపారు . సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే ఒంటిమిట్టలో నిత్య అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టీటీడీ, జిల్లా ,పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
The post శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
