తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రథ సప్తమి గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ ఏడాది జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను కూడా టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల సమిష్టి కృషితో అంగరంగ వైభవంగా నిర్వహించామని అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. రథ సప్తమి వేడుకలు విజయవంతం కావడంతో ఆయన అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రథ సప్తమి రోజున నిర్విరామంగా కష్టపడిన అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు.
అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా భక్తుల నుండి వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించడం జరిగిందని అన్నారు. భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఉత్తరమాడ వీధిలో ఒక భక్తుడు కూడా సదుపాయాలు బాగా లేవని చెప్పకపోవడం టీటీడీ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. పలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
The post సమిష్టి కృషితో రథ సప్తమి వేడుకలు విజయవంతం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
