హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్ర అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నట్టుగానే హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు . హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల బహూకరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐటీ, ఫార్మా తరహాలోనే సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో గత పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించాం అని చెప్పారు. ఆగిపోయిన 10 ఏళ్ల అవార్డులనూ బహూకరించాం. రెండో విడతగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు. గద్దర్ సినిమా అవార్డులను ప్రధానం చేయడం ప్రభుత్వం ఒక బాధ్యతగా భావించింది.
ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ తరలి రావడానికి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, రామానాయుడు, కృష్ణ తీవ్రమైన కృషి చేశారు. చార్మినార్‌కు నాలుగు మినార్లు ఎలాగో తెలుగు సినిమా పరిశ్రమ తరలి రావడానికి ఈ నలుగురు విశేషంగా కృషి చేశారు. సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని ఇళ్లు కట్టుకోవడానికి దానమిచ్చారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా పరిష్కరించడానికి దర్శకుడు దాసరి నారాయణ రావు చేసిన కృషి గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.
హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అని కాకుండా పాన్ ఇండియా – భారతీయ సినిమా ఒక గ్లోబల్ హబ్‌గా పరిశ్రమ మొత్తం ఒకే గొడుగు కిందకు వచ్చి గొప్ప సినిమాలు అందించాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సినిమాలను సైతం హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే నిర్మించేలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం అని పిలుపునిచ్చారు సీఎం.
The post సినీ రంగం అభివృద్ది కోసం సింగిల్ విండో విధానం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
