Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

స్థానికంపై వీడని టెన్షన్‌.. గవర్నర్‌ ఆమోదం లేకుండా చట్టమెలా?.. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ప్రశ్న

Ai generated article, credit to orginal website, October 9, 2025

రిజర్వేషన్లు 50% దాటరాదని సుప్రీంకోర్టు చెప్పింది కదా?
ఏకసభ్య కమిషన్‌ నివేదికపై ప్రజల అభ్యంతరాలను ఎందుకు స్వీకరించలేదు?
ప్రశ్నలు సంధించిన ధర్మాసనం
ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది: ఏజీ
షెడ్యూల్‌ మాత్రమే: పిటిషనర్లు
విచారణ నేటికి వాయిదా
బీసీ కోటాపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు.. విచారణ నేటికి వాయిదా

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు గత నెల 29వ తేదీన షెడ్యూల్‌ జారీ అయింది. నేటి (గురువారం) ఉదయం 10.30కు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కావాల్సి ఉన్నది. అయితే బీసీ కోటా పెంపు వివాదంపై హైకోర్టులో విచారణ నడి మధ్యలో ఉండటం, అది గురువారం 2.15కు వాయిదా పడటం ఉత్కంఠకు కారణమవుతున్నది. ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేదానిపై రాజకీయ పార్టీలు, ఆశావహులు, పరిశీలకుల్లో ఉత్కంఠ నెలకొన్నది. 

సాధారణంగా ఎన్నికలపై హైకోర్టులో విచారణ సాగుతూ ఉంటే, అది తేలేదాకా ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయదు. అది సంప్రదాయం. దాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పాటిస్తారా? లేదా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్న. దీనిపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నామని ఎస్‌ఈసీ వర్గాలు పేర్కొంటున్నాయి. హైకోర్టులో వాదనల సందర్భంగా… గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నదని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నోటిఫికేషన్‌ జారీ అయిందా? అని మాత్రమే ప్రశ్నించిన ధర్మాసనం దీనిపై నిర్దిష్టంగా ఏమీ చెప్పలేదు. 

ఎన్నికలపై నోటిఫికేషన్‌ జారీ చేసినా, తమ విచారణ కొనసాగుతుందని హైకోర్టు గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికలపై ఒకసారి నోటిఫికేషన్‌ జారీ అయితే, ఇక కోర్టులు జోక్యం చేసుకోలేవన్న వాదన ఒకటి ఉన్నది. స్థానిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేకపోవచ్చని, కానీ వార్డులు, డివిజన్ల పునర్విభజన, రిజర్వేషన్ల వ్యవహారాల్లో కోర్టులు నిరభ్యంతరంగా జోక్యం చేసుకోవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో నోటిఫికేషన్‌ జారీ అయినప్పటికీ, దానిపై కోర్టులు స్టే ఇవ్వచ్చని, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఇదే జరిగిందని వారు గుర్తుచేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నేడు నోటిఫికేషన్‌ వెలువడుతుందా? వెలువడినా అది కోర్టులో నిలబడుతుందా? కోర్టు స్టే ఇస్తుందా? అసలు ఎన్నికలు జరుగుతాయా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.
హైదరాబాద్‌, అక్టోబర్‌ 8 (నమస్తే తెలంగాణ): బీసీలకు 25 శాతం ఉన్న రిజర్వేషన్లను 42 శాతానికి (BC Reservations) పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుకు గవర్నర్‌ (Governor) ఆమోదం తెలుపకపోతే దానికి చట్టబద్ధత ఎలా వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు (High Court) ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 9ని రద్దు చేయాలని కోరుతూ బుట్టెంగారి మాధవరెడ్డి, సముద్రాల రమేశ్‌, బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాకే 42 శాతం రిజర్వేషన్ల అమలుతో ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్‌ లక్ష్మయ్య, హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లికి చెందిన న్యాయవాది శాంతప్ప, కులాలతో సంబంధం లేకుండా రైతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రైతు సంఘాల సమాఖ్య తదితరులు దాఖలు చేసిన పిటిషన్లు, ఇంప్లీడ్‌ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం విచారణ జరిపింది. దాదాపు ఐదు గంటలపాటు సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం విచారణ గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా పడింది.
ప్రశ్నల వర్షం కురిపించిన ధర్మాసనం
విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వం ముందు పలు ప్రశ్నలను సంధించింది. ‘బీసీలకున్న రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ప్రభుత్వం గత మార్చిలోనే గవర్నర్‌కు పంపినా.. ఇప్పటివరకు ఆమోదం లభించలేదు. సుప్రీంకోర్టు ఇటీవల తమిళనాడు కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం మూడు నెలల్లోగా ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదించకపోతే, సదరు బిల్లు ఆమోదం పొందినట్టుగా పరిగణించవచ్చు అన్న ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందా? ఈ క్రమంలో జూలై నెలలో ఆర్డినెన్స్‌ వెలువరించిందా? గత మార్చి 17న శాసనసభ బిల్లును ఆమోదించిన ప్రకారం.. ఆర్డినెన్స్‌కు అనుగుణంగా నోటిఫై చేసిందా?’ అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమకు తెలియదని చెప్పారు.
తెలుసుకుని చెప్పాలని హైకోర్టు అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. మహారాష్ట్రకు చెందిన వికాస్‌గావ్లీ కేసులో సుప్రీంకోర్టు.. స్థానిక సంస్థల పదవుల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెప్పిందని, ఈ తీర్పు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది కదా అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వీ స్పందిస్తూ.. గావ్లీ కేసులో సుప్రీంకోర్టు మూడు అంశాలను లేవనెత్తి రిజర్వేషన్లను 50 శాతానికి మించరాదని చెప్పిందని తెలిపారు. డెడికేటెడ్‌ కమిషన్‌ ద్వారా బీసీల సామాజిక వెనుకబాటుతనంపై అధ్యయనం చేయాలని, కమిషన్‌ సమర్పించే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఉండాలని ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వం చేసిందని చెప్పారు. కాబట్టి గావ్లీ కేసులో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న ఉత్తర్వులు తెలంగాణకు వర్తించవని తెలిపారు.
తిరిగి ధర్మాసనం కల్పించుకుంటూ బీసీల జనాభా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రీతుల్లో ఉన్నదని పిటిషనర్లు చెప్తున్నారని, ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని బీసీల వెనుకబాటుతనానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఉండాలని, రాష్ట్రం అంతటికీ ఒకే తరహాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది. దీనిపై సింఘ్వీ.. జిల్లాల్లోని బీసీల పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఉంటేనే ఆ విధంగా చేయాలని, జిల్లాల్లోని పరిస్థితులన్నీ ఒకే తరహాలో ఉన్నాయని చెప్పారు. మళ్లీ ధర్మాసనం నాలుగో ప్రశ్న వేసింది. బీసీల స్థితిగతులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి కమిషన్‌ సమర్పించిన నివేదికను బహిరంగపర్చాక ప్రజల నుంచి అభ్యంతరాలను ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించింది. కమిషన్‌ నివేదిక ఆధారంగా శాసనసభ సమగ్రంగా చర్చించి, ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని సింఘ్వీ తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని చెప్పారు. కమిషన్‌ ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి బీసీల స్థితిగతులపై జనాభా ఆధారంగా సమర్పించిన నివేదికకు శాస్త్రీయత ఉన్నదని అన్నారు.
ట్రిపుల్‌ టెస్ట్‌ చేయలేదు..
తొలుత పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, జే ప్రభాకర్‌, వివేక్‌రెడ్డి తదితరులు వాదనలు వినిపిస్తూ.. పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆ శాఖ కార్యదర్శి జీవో 9ని జారీ చేశారని చెప్పారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ద్వారా రిజర్వేషన్లు మొత్తం 67 శాతానికి చేరాయని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సొంత చట్టానికి, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని అన్నారు. కోర్టు తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని అన్నారు. షెడ్యూలు ప్రాంతాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచవచ్చని మినహాయింపు ఇచ్చిందని, ఆ పరిస్థితులు తెలంగాణలో లేవని తెలిపారు. మహారాష్ట్ర రిజర్వేషన్లు కల్పించినపుడు కృష్ణమూర్తి కేసులో చెప్పినట్టుగా ట్రిపుల్‌ టెస్ట్‌ చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించిందని గుర్తుచేశారు. రిజర్వేషన్లు 50 శాతం దాటినట్లయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ వెలువరించకూడదని చెప్పారు. ప్రభుత్వం చెప్పినట్టు కమిషన్‌ చేయకూడదని, రాజ్యాంగ సంస్థగా అది విధులు నిర్వహించాలని అన్నారు.
ఎస్టీలకు మినహాయింపు ఉంది.. బీసీలకు లేదు
రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్‌ కోర్టుల నిర్ణయమేనని, వీటిని ప్రభుత్వాలు అతిక్రమించకూడదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అన్నారు. రిజర్వేషన్ల కల్పనకు చట్టం అవసరమని కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. రాకేశ్‌కుమార్‌ కేసులో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మేఘాలయ, మిజోరం వంటి వెనుకబడిన రాష్ట్రాలలో ఎస్టీలకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. బీసీలకు అలాంటి మినహాయింపు ఏమీ లేదని చెప్పారు. బీసీలకు 1987లో రిజర్వేషన్లను పెంచితే నాటి ఉమ్మడి ఏపీ హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేశారు. ఏకసభ్య కమిషన్‌ నివేదిక గురించి ప్రస్తుతం ప్రజలకు తెలియకుండా నిర్వహించిన సర్వే చెల్లదని అన్నారు. జనాభా ఆధారంగా రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం చెల్లదని, విద్యా, ఉపాధి రంగాలకే వర్తిస్తుందని, ఈ తరహా నిర్ణయాలను గతంలోనే కోర్టులు కొట్టేశాయని గుర్తు చేశారు. చట్టం లేకుండా రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఈ మేరకు రాజ్యాంగంలోని 243(డీ) అధికరణం స్పష్టం చేస్తున్నదని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం
బీసీల జనాభా బాగా పెరిగినందున రిజర్వేషన్లు పెంచినట్టు ప్రభుత్వం చెప్తున్నదని, ఎస్సీలు, ఎస్టీల జనాభా కూడా పెరిగిందని, వాళ్లకు రిజర్వేషన్లు పెంచలేదని పిటిషర్ల తరఫు న్యాయవాదులు చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్లు పెంచకపోవడం వివక్ష కిందకే వస్తుందని అన్నారు. 2024 నాటి బీసీ జనాభా లెకలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెకలను ప్రామాణికంగా తీసుకుని అన్యాయం చేసిందని చెప్పారు. ఈ విషయం జీవో 41లో ఉందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.
కమిషన్‌ రిపోర్టు గుట్టుగానే ఉంది
బీసీ రిజర్వేషన్ల పెంపునకు కారణమైన ఏకసభ్య కమిషన్‌ నివేదిక ఇప్పటికీ గుట్టుగా ఉందని, బహిర్గతం చేయలేదని పిటిషనర్ల న్యాయవాదులు చెప్పారు. ఆ కమిషన్‌ మార్చిలో నివేదిక సమర్పించగా ప్రభుత్వం ఆమోదించిందని అన్నారు. అతి స్వల్ప కాలంలో కమిషన్‌ లోతుగా నివేదిక ఇవ్వడం నమ్మశక్యంగా లేదని చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ మాత్రమే విడుదలైందని, ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాలేదని, ఒకవేళ నోటిఫికేషన్‌ జారీ అయినా ట్రిపుల్‌ టెస్ట్‌ జరగాల్సిందేనని అన్నారు. బీసీలు 56 శాతం ఉన్నందున రిజర్వేషన్లు 42 శాతం ఇవ్వాలన్న కమిషన్‌ సిఫారసులకు కారణాలు కూడా ఎవరికీ తెలియవని చెప్పారు. బిల్లును అసెంబ్లీ మార్చిలో ఆమోదించిందని, దీనిని గవర్నర్‌కు పంపితే ఇంకా ఆమోదం రాలేదని, అయినా జీవో 9ని జారీ చేసిందని చెప్పారు. గవర్నర్‌ ఆమోదం పొందిన రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తెలిపారు. మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల కేసులో సుప్రీంకోర్టు అదేవిధంగా ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. మున్సిపల్‌ చట్టంలోని సెక్షన్‌ 7 ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించరాదని చెప్పారు.
మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ
కోర్టు సమయం దాటాక సుమారు 5 గంటలప్పుడు అడ్వకేట్‌ జనరల్‌ కల్పించుకుంటూ.. విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. దీనిపై పిటిషనర్‌ న్యాయవాది జోక్యం చేసుకుని ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ రావచ్చునని, మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడి ఉండవచ్చునని, ఎన్నికల షెడ్యూల్‌ ఇదివరకే జారీ అయ్యిందని, నోటిఫికేషన్‌ ఈరోజు రాకపోయి ఉంటే రేపు రావచ్చునని చెప్పారు. అయితే ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను వెలువరించకుండానే ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • Election Commission: తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్‌-2
  • Mahagathbandhan: ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం – మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో
  • Prashant Kishor: ప్రశాంత్‌ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
  • Delhi Airport: దిల్లీ ఎయిర్‌పోర్టులో బస్సు దగ్ధం
  • APEPDCL: మొంథా తుఫానుపై అప్రమత్తమైన ఏపీఈపీడీసీఎల్

Recent Comments

No comments to show.

Archives

  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes