సింగిల్ జడ్జి తీర్పునకు డివిజన్ బెంచ్ సమర్థన
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి 1956 తర్వాత వలసొచ్చిన ఎస్టీలు లంబాడీ క్యాటగిరీ కిందికి రాబోరని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు సింగిల్‌జడ్జి గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబీకులకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రం ఇవ్వడంపై ఆలిండియా బంజారా సేవాసంఘ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కలెక్టర్ వారికిచ్చిన ఎస్టీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు.
దీనిపై హాన్ దేవానంద్ కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌జడ్జి సైతం కులధ్రువీకరణ పత్రం రద్దును సమర్థిస్తూ తీర్పునిచ్చారు. దీనిపై వారు అప్పీల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ సింగిల్‌జడ్జి తీర్పు సమర్థనీయమేనని తేల్చిచెప్పింది. 1950నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వలసవచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. అప్పీలుదారులు 1956 తర్వాత వలస వచ్చారు కాబట్టి ఎస్టీ క్యాటగిరీ కిందికి రాబోరని తేల్చింది.
ఇంకా చదవల్సిన వార్తలు
రాజీకి లోక్‌అదాలత్ సరైన వేదిక : హైకోర్టు
హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జరిమానాతో పరిషారమ య్యే క్రిమినల్ కేసులు, ఎక్సైజ్, చెక్‌బౌన్స్, ఆర్టీవో వంటి కేసులను ఉభయపక్షాలు చర్చలతో రాజీ చేసుకునేందుకు లోక్ అదాలత్ సరైన వేదికని హైకోర్టు అభిప్రాయపడింది. చిన్నపాటి కేసులను లోక్‌అదాలత్‌లో పరిషరిస్తే కోర్టులపై పనిభారం తగ్గుతుందని హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి జస్టిస్ పీ శ్యాంకోశీ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 21న నిర్వహించనున్న లోక్‌అదాలత్ సన్నాహక సమావేశా న్ని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో పోలీసు అధికారులతో జస్టిస్ శ్యాంకోశీ శనివారం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిమానాతో పరిషారమయ్యే కేసులను ఉభయపక్షాలు చర్చలతో రాజీ చేసుకునేందుకు లోక్‌అదాలత్ సరైన వేదిక అని చెప్పారు. ఆ తరహా ఎక్సైజ్ కేసులను గుర్తించాలని ఆ శాఖ కమిషనర్‌కు సూచించారు. సమావేశానికి డీజీపీ శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ మహేశ్ భగవత్, అదనపు డీజీ సీఐడీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితరులు పాల్గొన్నారు.
