‘ఏమ్మా.. పెళ్లి ఎప్పుడు?’ పాతికేండ్లు దాటిన ప్రతీ అమ్మాయి.. అబ్బాయి.. ఎదుర్కొనే ప్రశ్న! ‘ఇంకా ఆలస్యం ఎందుకు?’, ‘మంచి సంబంధం వచ్చింది‘, ‘వయసు దాటిపోతున్నది’.. ఇలాంటి మాటలు నేటి తరం చెవులకు కొత్తేం కాదు. కానీ.. ఒక్క నిమిషం ఆగండి. మనం అనుకుంటున్న ‘సరైన వయసు’.. మన పిల్లలకు ‘సరైన వయసు’ కాకపోవచ్చు! మనం కోరుకునే ‘సంప్రదాయ బంధం’.. వారికి అసహజంగా అనిపించవచ్చు! మనం నమ్మే ‘ఆర్థిక భద్రత’.. వారు కోరుకునే ‘భావోద్వేగ భద్రత’ కన్నా ఇంపార్టెంట్ కాకపోవచ్చు! ఇదేంటి ఇంత మార్పు? నిజమే.. భారతీయ వివాహ వ్యవస్థలో గత పదేండ్లలో ఊహించని మార్పులు వచ్చేశాయ్. జీవన్ సాథీ లాంటి మ్యాచ్‌మేకింగ్ ప్లాట్‌ఫామ్స్ 2016-25 మధ్య యూజర్ ట్రెండ్స్‌ను విశ్లేషించగా.. వెలుగుచూసిన నిజాలు వింటే.. ‘పెండ్లిముచ్చట ఇంతగా మారిందా’ అనిపించక మానదు!!
2016లో పిల్లల పెండ్లి కోసం వెతుకులాట మొదలుపెట్టే సగటు వయసు 27 ఏండ్లుగా ఉండేది. 2025 నాటికి అది 29 ఏండ్లకు చేరిందట. అంటే.. రెండేండ్ల ఆలస్యం! ఇంకా ఆశ్చర్యం ఏంటంటే.. ఇప్పుడు 50% మంది యూజర్లు తమ మ్యాచ్‌మేకింగ్ ప్రయాణాన్ని సరిగ్గా 29వ యేటే మొదలుపెడుతున్నారు. అంటే.. పాతికేండ్లు వచ్చినా పెండ్లి కాకపోతే ‘అయ్యో పాపం’ అని నోళ్లు నొక్కుకునే సీన్లకు కాలం చెల్లిందన్నమాట! ‘నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడే పెండ్లి’ అనే కొత్త ఆలోచన వేళ్లూనుకుంటున్నది.
సరైన వ్యక్తి vs సరైన వయసు
30,000 మంది యాక్టివ్ యూజర్లతో జరిపిన ఒక సర్వేలో 90 శాతం మంది చెప్పిన మాట ఒక్కటే.. ‘నాకు కావాల్సింది సరైన వ్యక్తి.. సరైన వయసు కాదు. సరైన అవగాహన.. సరైన జీతం కాదు’ అనేశారు. కేవలం 7 శాతం మంది మాత్రమే ‘డబ్బు ముఖ్యం’ అన్నారట. ఓన్లీ 3 పర్సెంట్ మంది ‘సరైన వయసు ముఖ్యం’ అన్నారని సదరు సర్వే చెబుతున్నది. అంటే.. పెండ్లి అనేది ఇప్పుడు ‘టిక్ చేయాల్సిన బాక్స్’ కాదు.. ‘ఫిల్ చేయాల్సిన బంధం’!
కులం.. ఓన్లీ ఆప్షన్ .. నాట్ ఆబ్లిగేషన్
ఇక్కడే అసలైన గేమ్‌చేంజర్ ఉంది. 2016లో.. 91 శాతం మంది యూజర్లు కులాన్ని స్ట్రిక్ట్ ప్రిఫరెన్స్‌గా పెట్టుకునేవారట. ఇతర కులాలకు సంబంధించిన మ్యాచ్‌లను అవాయిడ్ చేసేవారు. 2025 నాటికి ఆ సంఖ్య 54 శాతానికి పడిపోయింది. అంటే.. సగం మంది వరకు ఇప్పుడు ‘కులం కంటే వ్యక్తిత్వం ముఖ్యం’ అని భావిస్తున్నారు. ఇదేమంత చిన్న మార్పు కాదు.. సామాజిక విప్లవం! తరాల తరబడి మన సమాజంలో కులాల ప్రాతిపదికనే సంబంధాలు నిశ్చయం చేసుకునేవారు. ఇప్పుడు అది మనసుల కలయికగా మారుతున్నది. తెలుగు రాష్ర్టాల్లోనూ ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తున్నది. చాలా నగరాల్లో యువత.. కులం కంటే కెరీర్, కమ్యూనికేషన్, కంపాటిబిలిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సంస్కృతిలో కులం, గోత్రం లాంటి అంశాలు ఇంకా ముఖ్యమే. కానీ, యువత మాత్రం ‘కులం కంటే క్యారెక్టర్ ముఖ్యం’ అనే ధోరణితో ముందుకుసాగుతున్నారు.
కలిసి సంపాదిద్దాం..
పెండ్లి అంటే ఆర్థిక భద్రత అనే భావన కూడా మారుతున్నది. ఒకప్పుడు ‘మగాడు సంపాదించాలి.. ఆడది ఇల్లు చూసుకోవాలి’ అనే ఫార్ములా ఉండేది. ఇప్పుడు.. 42% మంది యూజర్లు ‘ఇద్దరూ సమానంగా సంపాదించాలి.. సమంగా ఖర్చు చేయాలి’ అనుకుంటున్నారు. కేవలం 8% మంది మాత్రమే ‘ఒకరే మెయిన్ ఇన్‌కమ్ సోర్స్ కావాలి’ అంటున్నారు. అంటే.. ‘సోల్ బ్రెడ్‌విన్నర్’ కాన్సెప్ట్ ఇప్పుడు ‘డ్యూయల్ ఇన్‌కమ్’గా మారింది. ఇది మహిళలకు మాత్రమే కాదు.. పురుషులకు కూడా ఒత్తిడి తగ్గించే విషయం!
మార్పుల వెనుక కారణాలెన్నో
కెరీర్: ఉద్యోగంలో సెటిలయ్యాకే పెండ్లి అనే టైమ్‌లైన్‌ను యువత ఫాలో అవుతున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్: ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచవ్యాప్త ఆలోచనలు యువతపై ప్రభావం చూపుతున్నాయి.
ఆర్థిక స్వాతంత్య్రం: మహిళలు ఆర్థికంగా స్వతంత్రులు కావడంతో.. పెండ్లిపై ఒత్తిడి తగ్గింది.
మ్యాచ్‌మేకింగ్ యాప్స్: జీవన్‌సాథీ, షాదీ.కామ్, భారత్ మ్యాట్రిమోనీ లాంటి యాప్స్ వల్ల ఎంపికలు పెరిగాయి.. నిర్ణయాలు సులభమయ్యాయి.
మానసిక అవగాహన: ‘కంపాటిబిలిటీ’, ‘ఎమోషనల్ ఇంటెలిజెన్స్’ లాంటి పదాలు ఇప్పుడు పెండ్లి చర్చల్లో వినిపిస్తున్నాయి. పేరెంట్స్ ఆలోచించండి..
వినండి.. విచారించండి: పిల్లలు ‘ఇప్పుడే పెండ్లి వద్దు’ అంటే కోపానికి రాకుండా.. వారి ఆలోచనలు అర్థం చేసుకోండి.
క్యారెక్టర్: సంబంధాలు చూసేటప్పుడు కులం కంటే వ్యక్తిత్వం, అవగాహన, కెరీర్ గోల్స్‌కు ప్రాధాన్యం ఇవ్వండి.
ఆర్థిక సమానత్వం: ‘అమ్మాయి సంపాదన కూడా ముఖ్యం’ అనే ఆలోచనను అంగీకరించండి.
సెకండ్ చాన్స్
ఒకప్పుడు పెండ్లి అంటే జీవితానికి ఒకేసారి అనే భావన ఉండేది. విడాకులు తీసుకున్న వారిని సమాజం చూసే చూపు కూడా వేరేగా ఉండేది. ఈ విషయంలోనూ ఈ తరం దృక్కోణం మారింది. జీవన్‌సాథీ ప్లాట్‌ఫామ్‌లో రెండో పెండ్లి కోసం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వారి వాటా 2016లో 11 శాతం ఉండగా, 2025 నాటికి 16 శాతానికి పెరిగింది. ఇటీవల సదరు ప్లాట్‌ఫామ్ వేదికగా జోడీ కడుతున్న ప్రతి ఆరు మ్యాచింగ్స్‌లో ఒకటి సెకండ్ మ్యారేజ్‌దే కావడం విశేషం. అంటే సెకండ్ మ్యారేజ్ ఇప్పుడు సర్వ సాధారణంగా మారిపోయింది. ‘విడాకులు తీసుకున్నావు కదా.. నీకు మళ్లీ పెళ్లి ఎలా అవుతుంది?’ అనే ప్రశ్న ఇప్పుడు ‘నీకు నచ్చిన వ్యక్తి దొరికాడా?’ అని మారిపోయింది.
