దేశ చరిత్రలో ఏపీకి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి
పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రూ.87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది.. విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద మూడు క్యాంపస్‌లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది ఎస్ఐపీబీ సమావేశం.. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీకి సాధించటంపై ఐటీ శాఖామంత్రి నారా లోకేష్‌కు ముఖ్యమంత్రి, మంత్రులు అభినందనలు తెలియచేశారు. క్వాంటం వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్‌గా మారతాయని అన్నారు. కేవలం 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. డేటా సెంటర్లతో ఓ ఎకో సిస్టం వస్తోందని.. విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపీబీల ద్వారా రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.20 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి.
విద్యుత్ జేఏసీ చర్చలు విఫలం.. పోరుబాటలో విద్యుత్ ఉద్యోగులు
విద్యుత్ యాజమాన్యాలతో విద్యుత్ JAC నాయకులు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.. దీంతో, పోరుబాటలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు విద్యుత్ ఉద్యోగులు.. 13వ తేదీన ఛలో విజయవాడ, 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.. అయితే, సంవత్సరం నుంచి సాగుతున్న చర్చలు ఫలితం లేకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.. యాజమాన్యం కాలయాపన చేస్తోందని, సమస్యల పరిష్కారం వైపు రావడం లేదని జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.. మొండి వైఖరి ఆపాలి.. ఛలో విజయవాడ సమ్మె తప్పదంటున్నారు విద్యుత్ ఉద్యోగులు. ఇక, డిమాండ్ విషయానికి వస్తే.. కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్, ఎనర్జీ అసిస్టెంట్, డీఏ పెంపు లాంటి కీలక డిమాండ్లు ఉన్నాయి.. గత చర్చల్లో ఇచ్చిన హామీలను ఆర్డర్ రూపంలో ఇవ్వలేదని అంటున్నారు జేఏసీ నేతలు.. 50 వేల కుటుంబాలు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది.. 45 రోజులుగా ఆందోళనలో 27 వేల కాంట్రాక్ట్, 35 వేల పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు.. యాజమాన్యం చర్చల పేరుతో సమయం వృథా చేస్తుందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు.. ఎనర్జీ సెక్రటరీ స్వయంగా చర్చలకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.. కాంట్రాక్ట్ కార్మికులు 25 ఏళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. తెలంగాణలో పర్మినెంట్ చేసినట్టే ఏపీలోనూ చేయాలి కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 3 ఏళ్లు పనిచేసిన వారిని పర్మినెంట్ చేయాలని.. నారా లోకేష్, పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు జేఏసీ నేతలు..
నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. వారిపై కఠిన చర్యలు..
ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మధ్యం వ్యవహారం కలకలం రేపింది.. అయితే, రాష్ట్రంలో నకిలీ మద్యానికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రం అంతా కల్తీ మద్యం అంటూ ప్రజలను భయపెడుతున్నారు.. ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.. అయితే, రాష్ట్రంలో మద్యం మరణాలపై విచారణ చేయాలని ఆదేశించారు.. ఇక, రాజకీయ కుట్రలతో కల్తీ మద్యం అంటూ.. మద్యం మరణాలు అంటూ తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారం కలకలం రేపగా.. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు భారీ షాక్ తగిలింది.. జయచంద్రా రెడ్డి, సురేశ్ నాయుడులను టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం విదితమే.. ఇక, అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలకు గతంలోనే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని.. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
ప్రధాని మోడీ పర్యటనపై చంద్రబాబు సమీక్ష.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!
మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రాబోతున్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై దృష్టిసారించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 16వ తేదీన ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. సీఎస్, డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ఈ క్రమంలో అమరావతి, విశాఖల్లో ప్రధాని మోడీ పాల్గొన్న కార్యక్రమాలను మించిన స్థాయిలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని పర్యటనను సక్సెస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, తన పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ.. శ్రీశైల భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హజరు కానున్నారు. కేంద్రం తెచ్చిన జీఎస్టీ-2.0 సంస్కరణలను స్వాగతించి.. దేశంలోనే తొలిసారిగా అసెంబ్లీలో అభినందనల తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం. అలాగే జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ పేరుతో దసరా నుంచి దీపావళి వరకు పెద్ద ఎత్తు ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని పాల్గొనే ఈ సభను విజయవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ సభ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధాని పర్యటన సందర్భంగా వాతావరణ పరిస్థితులను చూసుకుని.. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రధాని సభకు వచ్చే సభికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని.. ఆహారం, తాగునీరు సౌకర్యం కల్పించాలని.. సభకు వచ్చే అప్రోచ్ రోడ్లను పూర్తి చేయాలని.. పార్కింగ్ నిమిత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధిపై విచారణ.. ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది.. అయితే, దీనిపై పెద్ద దుమారమే రేగింది.. పీపీపీ మోడ్ అంటూనే మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడంటూ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించింది.. ఇక, ఈ వ్యవహారం ఏపీ హైకోర్టు వరకు చేరింది.. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల అభివృద్ధిని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది.. ఆ పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. పీపీపీ మోడల్లో వైద్య కళాశాలల అభివృద్ధికి అనుమతిస్తున్న జారీ చేసిన జీవో నంబర్ 590ని రద్దు చేయాలని పిటిషనర్ వాదించారు.. అయితే, దీనిపై కూటమి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.. ఇక, తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.. మరోవైపు బిడ్డింగ్ ప్రక్రియపై ఇప్పుడు స్టే ఇవ్వలేమని వ్యాఖ్యానించింది ధర్మాసనం.. అయితే, ఈ పిల్‌ను గుంటూరు జిల్లా తాడేపల్లి చెందిన డాక్టర్ జు వసుంధర దాఖలు చేశారు.. 590 జీవో రద్దు చేయటంతో పాటు వైద్య కళాశాలల నిర్వహణ, నిర్మాణం, పాలన గత జీవోలకు అనుగుణంగా ప్రభుత్వం నడిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు పిటిషనర్..
యథావిధిగా స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్..
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు (గురువారం) యథావిధిగా నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు ఉదయం 10.30 గంటలకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపటికి వాయిదా పడినప్పటికీ, ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ మాత్రం ఆటంకం లేకుండా ముందుకు సాగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారించింది. విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు జరిగినప్పటికీ, తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. రేపు మరిన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే, రేపటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాదులు చేసిన వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. రేపు విడుదల కానున్న నోటిఫికేషన్ తెలంగాణలోని 31 జిల్లాల్లోని 565 మండలాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,749 ఎంపీటీసీలు, 565 జడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఆయా జిల్లాల్లోని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
అప్పటివరకు ఉన్నత విద్యా సంస్థల సమ్మె వాయిదా..
ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రభుత్వం ఇచ్చిన హామీతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డిని సమాఖ్య ప్రతినిధులు కలసి తమ సమస్యలను వివరించారు. అనంతరం వారు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం దీపావళి లోపల రూ.300 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో అక్టోబర్ 13వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెను, కళాశాలల బంద్ కార్యక్రమాన్ని అక్టోబర్ 23వ తేదీ వరకు (దీపావళి మరుసటి రోజు వరకు) వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే, దీపావళి నాటికి బకాయిలు విడుదల కాకపోతే.. అక్టోబర్ 23న మళ్లీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామని సమాఖ్య స్పష్టం చేసింది. ఇక, దసరా ముందు విడుదల చేసిన రూ.200 కోట్ల బకాయిల్లో సుమారు 70 మైనారిటీ, జనరల్ కళాశాలలకు ఒక్క రూపాయి కూడా అందలేదని సమాఖ్య పేర్కొంది. ప్రభుత్వం వెంటనే నిధుల విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
అక్టోబర్ 20 లేదా 21.. దీపావళి పండగను ఎప్పుడు జరుపుకోవాలి!
‘దీపావళి’ పండుగ హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ దీపాల పండుగ కోసం దేశంలోని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి దీపావళి పండగ తేదీ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. కొంతమంది జ్యోతిష్కులు దీపావళి పండగను అక్టోబర్ 20న వస్తుందని చెబుతుండగా.. మరికొందరు అక్టోబర్ 21న జరుపుకుంటారని అంటున్నారు. ఈ నేపథ్యంలో దీపావళి పండగను ఏ రోజున జరుపుకోవాలో మనం తెలుసుకుందాం. దేశంలోని ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ ఈ సంవత్సరం దీపావళిని అక్టోబర్ 20న జరుపుకోవాలని స్పష్టం చేసింది. దీపావళి పండగ తేదీల గందరగోళం నేపథ్యంలో తాజాగా కౌన్సిల్ ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో దీపావళి తేదీపై సుదీర్ఘంగా చర్చించారు. మతపరమైన సూత్రాలు, లేఖనాత్మక లెక్కల ఆధారంగా పూర్తి ప్రదోష కాలం అక్టోబర్ 20న మాత్రమే ఉంటుందని తేల్చారు. అక్టోబర్ 21న అమావాస్య మూడున్నర గంటలకు పైగా ఉండటంతో నక్త ఉపవాసం (లక్ష్మీ ఆరాధనలో ముఖ్యమైన భాగం) విచ్ఛిన్నం చేయడానికి ఆ రోజు సమయం ఉండదు. అందువల్ల అక్టోబర్ 20న దీపావళిని జరుపుకోవాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయించింది.
‘‘ఆజాద్ కాశ్మీర్’’ టీషర్ట్ వేసుకున్న స్టూడెంట్.. కేసు నమోదు..
బెంగళూర్‌లో ఓ విద్యార్థి ‘‘ఆజాద్ కాశ్మీర్’’ మ్యాప్, జెండా ఉన్న టీషర్టును ధరించడం చర్చకు దారి తీసింది. నగరంలోని అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. నిందితుడిని కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఇనాయత్ అమీన్‌గా గుర్తించారు. వివాదాస్పద టీషర్టు ధరించిన అమీన్ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. వీడియోలో కనిపిస్తున్న బైక్ నెంబర్ ఆధారంగా అతడిని గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సెప్టెంబర్ 22న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ అయింది. అమీన్ ఎరుపు రంగు టీషర్టుపై ‘ ఆజాద్ కాశ్మీర్’ మ్యాప్, జెండాను ముద్రించి ఉంది. చొక్కాపై పాకిస్తాన్ జెండా కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.
దుమ్మురేపిన మహ్మద్ సిరాజ్.. అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు!
ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్మురేపాడు. కెరీర్లో అత్యుత్తమ టెస్టు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకిన సిరాజ్.. 12వ స్థానానికి చేరుకున్నాడు. హైదరబాదీ పేసర్ ఖాతాలో ప్రస్తుతం 718 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఏడు వికెట్లు పడగొట్టడంతో సిరాజ్ దూసుకొచ్చాడు. అక్టోబర్ 10 నుంచి న్యూఢిల్లీలో ఆరంభం కానున్న రెండో టెస్టులో కూడా చెలరేగితే.. తర్వాతి ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుమ్రా ఖాతాలో 885 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 7 స్థానాలు ఎగబాకి.. 21 ర్యాంకులో నిలిచాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (908) నంబర్ వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. యశస్వి జైస్వాల్ ఐదవ ర్యాంక్‌లో ఉన్నాడు. రిషభ్ పంత్ 8, శుభ్‌మన్ గిల్ 13 స్థానాల్లో కొనసాగుతున్నారు. విండీస్‌పై సెంచరీ చేసిన రవీంద్ర జడేజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో కెరీర్లో ఉత్తమ రేటింగ్ పాయింట్లు సాధించాడు. జడేజా 6 స్థానాలు మెరుగై 25వ స్థానానికి ఎగబాకాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా టాప్‌లో ఉన్నాడు.
తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
హీరోయిన్లు ఈ మధ్య బోల్డ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ ఇలాంటి ఊహించిన కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు పాయల్ ఘోష్. ఈమె బాలీవుడ్ బ్యూటీ అయినా సరే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాలో నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఆమె ఎప్పటికప్పుడు క్రికెటర్లపై బోల్డ్ కామెంట్లు చేస్తూ ఉంటుంది. గతంలో ఇర్ఫాన్ పటాన్ తనతో ఐదేళ్ల పాటు డేటింగ్ చేశాడని.. కానీ మధ్యలో మోసం చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలిపింది. ఆ బాధతోనే తొమ్మిదేళ్ల పాటు శృంగారానికి దూరంగా ఉన్నట్టు వివరించింది. అతని తర్వాత గౌతమ్ గంభీర్ కూడా అప్పుడప్పుడు మెసేజ్ లు చేసేవాడని.. కానీ తానురిప్లై ఇవ్వలేదని వివరించింది. మధ్యలో ఓ వ్యక్తి తనతో శృంగారం చేసేందుకు ప్రయత్నించినా.. తాను పట్టించుకోలేదని స్పష్టం చేసింది. శృంగారం మీద ఉన్న గౌరవంతోనే తాను ఎవరితోనూ అలాంటి తప్పుడు పనులు చేయలేదని చెప్పుకొచ్చింది.
ప్రభాస్ తో షూటింగ్ కు ముందు రోజూ అలా చేశా
శ్రియారెడ్డి పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె రీసెంట్ గానే ఓజీ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఆమెకు మంచి పవర్ ఫుల్ రోల్ పడింది. మనకు తెలిసిందే కదా.. పవర్ ఫుల్ నెగెటివ్ రోల్స్ చేయాలంటే శ్రియారెడ్డి తర్వాతనే ఎవరైనా అనేది. గత సినిమాల్లోనూ ఆమె ఇలాంటి పవర్ ఫుల్ రోల్స్ చేసింది. ఇక ప్రభాస్ తో సలార్ సినిమాలో కనిపించి హైలెట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సలార్ సినిమా షూటింగ్ కు ముందు రోజూ తాను ఏం చేసేదో బయట పెట్టింది. ఇందుకు సంబంధించిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ తో ఎప్పటి నుంచో నటించాలనే తన కల సలార్ తో తీరిపోయిందని తెలిపింది. అయితే సలార్ సినిమాలో ఎక్కువగా మగవాళ్లే కనిపిస్తుంటారు. అంత మంది మగవారి మధ్య నేను హైలెట్ కావడం కోసం ప్రతి రోజూ షూట్ కు ముందు 50 పుష్ అప్స్ తీసేదాన్ని. అలా పుష్ అప్స్ చేయడం నాకు చాలా ఈజీగా అనిపించేది. అలా చేయడం వల్లే సినిమాలో నేను హైలెట్ కాగలిగాను. నా పాత్ర అంత బాగా ఎలివేట్ అయింది. ప్రభాస్ లాంటి బాడీ ఉన్న హీరోతో స్క్రీన్ లో మనం కనిపించాలి అంటే ఆ మాత్రం చేయాలి కదా అంటూ నవ్వేసింది శ్రియారెడ్డి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రియారెడ్డికి ఇప్పుడు మళ్లీ వరుస ఛాన్సులు వస్తున్నాయి. త్వరలోనే మరో రెండు సినిమాల్లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.
‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో రిపీట్!
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై సంచలన విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సక్సెస్ఫుల్ కాంబినేషన్ మరోసారి పునరావృతం కాబోతోంది. యువతకు కనెక్ట్ అయ్యే కథతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు యదు వంశీ, నిర్మాత నిహారిక కొణిదెలతో కలిసి మరో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వీరిద్దరి కలయికలో రాబోయే ఈ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం కేవలం కమర్షియల్ విజయానికే పరిమితం కాలేదు, ఎన్నో ప్రత్యేకతలను సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా ఏకంగా 11 మంది నటులు, నలుగురు హీరోయిన్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట్రికల్‌గా రూ.18.5 కోట్లు వసూళ్లను రాబడితే, నాన్ థియేట్రికల్‌గా రూ.6 కోట్లు బిజినెస్ జరిగింది. మొత్తంగా సినిమా రూ.24.5 కోట్ల వసూళ్లను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘కమిటీ కుర్రోళ్లు’ విజయం తర్వాత నిర్మాతగా నిహారిక తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2ను కూడా నిర్మిస్తున్నారు. ఒకవైపు అవార్డులు గెలుచుకుంటూ, మరోవైపు విభిన్నమైన కథలతో సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా నిహారిక తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు యదు వంశీతో మరోసారి చేతులు కలపడంతో వారి కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.
