Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 13న నోటిఫికేషన్ వెలువడుతుంది. కానీ… బీజేపీ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. అసలా విషయంలో ఒక క్లారిటీ ఉందో లేదో కూడా బయటికి తెలియడం లేదు. అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు నాయకులతో కమిటీ వేసి అభిప్రాయ సేకరణ కూడా చేసింది పార్టీ రాష్ట్ర నాయకత్వం. ఈ క్రమంలో… త్వరలోనే ముగ్గురు పేర్లతో రాష్ర్ట ఎన్నికల కమిటీ కేంద్ర పార్టీకి లిస్ట్ పంపబోతోందట. మరోవైపు ఈసారిపార్టీ టిక్కెట్ ఆశిస్తున్న వాళ్ళ లిస్ట్ చాంతాడంత ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. జూబ్లీహిల్స్ కమలం టిక్కెట్ ఆశిస్తున్న వారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో కొందరైతే గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం రేస్‌లో అరడజన్‌కు పైగా మహిళా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన జూటూరు కీర్తి రెడ్డి ఈసారి నాకో ఛాన్స్ అంటున్నారట. అందుకు తగ్గట్టే… ఆమె నియోజకవర్గంలో ఎప్పటి నుంచో తిరుగుతున్నారు కూడా. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ వీరపనేని పద్మ కూడా సీటు ట్రయల్స్‌లో ఉన్నారు. తనకు సామాజికవర్గం కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారట ఆమె.
Read Also: Samantha : సమంత మొదటి సంపాదన ఎంతో తెలుసా..?
ఇక మరో మహిళా నేత ఆకుల విజయ కూడా టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నట్టు సమాచారం. పార్టీకి చెందిన కొందరు పెద్ద నేతలతో కూడా రికమండ్ చేయించుకుంటున్నారట ఆమె. ఆ నేతలు అభిప్రాయ సేకరణ కమిటీ ముందు తమ మనసులో మాట చెప్పేసినట్టు తెలుస్తోంది. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయిన మాధవీలత కూడా టికెట్ రేస్‌లోకి వచ్చేశారట. ఆమె తనకున్న పరిచయాలతో ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ శ్రేణులు. రీసెంట్‌గా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్‌రావును కలిశారు జయసుధ. దీంతో ఆమె పేరు కూడా జూబ్లీ హిల్స్ అభ్యర్ధిగా తెరపైకి వచ్చింది.
ఇక బండారు దత్తాత్రేయ కూతురు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయ లక్ష్మి పేరు కూడా వినిపిస్తోంది. విజయలక్ష్మి పేరు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వినిపించింది… సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏదో ఒక సీట్ నుండి ఆమె పోటీ చేయవచ్చన్న ప్రచారం జరిగినా… సాధ్యపడలేదు. ఇక గ్రేటర్ హైదరాబాద్ మాజీ మేయర్ , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి కూడా పార్టీ అడిగితే… పోటీకి సిద్ధమని అంటున్నారట. ఈ రకంగా జూబ్లీహిల్స్ కోసం తెంలగాణ బీజేపీలో మహిళా నేతలు మేమంటే మేమంటూ పోటీలు పడుతున్నారు. ఎవరికంటే ఏం తక్కువ కాదంటూ… సీరియస్ ట్రల్స్‌లో ఉన్నారట. దీంతో పార్టీ అధిష్టానం ఎవరివైపు మొగ్గుకతుందన్న ఉత్కంఠ పెరుగుతోంది.
