కట్టుకున్న మొగుడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కలిసి బతుకుదాం అని నమ్మించి.. అత్యంత దారుణంగా కడతేర్చాడు. చున్నీతో ఉరి వేశాడు కానీ అప్పటికీ చావలేదని.. ఫెన్సింగ్ రాయితో ఛాతీపై మోదాడు. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. భార్యను అత్యంత దారుణంగా చంపేసిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వెంకన్నగూడలో జరిగింది.
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వానరాశి జంగయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని వెంకన్నగూడ స్వస్థలం. కానీ అతడు చాలా కాలం నుంచి హైదరాబాద్‌లో కార్ డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మరో విషయం ఏంటంటే జంగయ్యకు ఇద్దరు భార్యలు. ప్రస్తుతం మొదటి భార్యతోనే ఉంటున్నాడు. కానీ రెండో భార్య రజిత మాత్రం విడిగా ఉంటోంది. రజితతో చాలా రోజుల క్రితం నుంచే జంగయ్యకు గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆమె వేరుగా నివాసం ఉంటోంది. ఐతే జంగయ్య.. ఈ మధ్య కలిసి జీవిద్దాం అని చెప్పి తన ఊరు వెంకన్నగూడకు రప్పించాడు. పెద్దల సమక్షంలో ఇరువురు మాట్లాడుకున్నారు. అయినప్పటికీ రజిత.. జంగయ్యతో కలిసి ఉండేందుకు ఒప్పుకోలేదు. దీంతో అతను భార్యపై కక్ష పెంచుకున్నాడు.
Also Read: Crime News: కన్న తల్లినే దారుణంగా చంపేసిన కొడుకు.. కారణం తెలిస్తే బిత్తరపోవాల్సిందే!
ఇద్దరూ.. ఊరు నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఊరికి సమీపంలో ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన జంగయ్య.. రజిత మెడకు స్కార్ఫ్ బిగించి హత్య చేశాడు. అప్పుడు కూడా ఆమె కొన ఊపిరితో ఉండడంతో.. పక్కనే ఉన్న ఫెన్సింగ్ దిమ్మెను తీసుకుని ఆమె ఛాతీపై బలంగా మోదాడు. అప్పుడు రజిత ప్రాణాలు కోల్పోయింది. స్పాట్‌లోనే రెండో భార్య రజిత డెడ్ బాడీ ఫోటోలు తీసుకున్నాడు జంగయ్య. ఆ ఫోటోలను మొదటి భార్యకు పంపించాడు. అంతే కాదు ఆమెకు కాల్ చేసి.. ఇదిగో ఇలా చంపాను అని చెప్పాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. అతని ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు.. రజిత డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తర్వాత జంగయ్యను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
