ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా బుధవారం కొలంబోలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడింది. 222 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్ 36.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయి.. 107 పరుగుల భారీ తేడాతో ఓడింది. దాంతో మెగా టోర్నీలో పాకిస్థాన్ హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు 28 ఏళ్లలో ఆస్ట్రేలియాను వన్డేలో ఓడించలేదు. రెండు జట్లు ఇప్పటివరకు 18 వన్డేలు ఆడాయి కానీ.. పాక్ ఒక్క విజయం అందుకోలేదు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. బెత్ మూనీ (109; 114 బంతుల్లో 11 ఫోర్లు) సెంచరీ చేయగా.. అలానా కింగ్ (51 నాటౌట్; 49 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేసింది. అలీస్సా హిలీ (20), ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (10), ఎల్లీస్ పెర్రీ (5), అనాబెల్ సదర్లాండ్ (1), ఆష్లీన్ గార్డ్‌నర్ (1), తాహిలా మెక్‌గ్రాత్ (5), జార్జియా వేర్‌హామ్ (0) విఫలమయ్యారు. 76 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును బెత్ మూనీ ఆడుకుంది. ఆమెకు అలానా సహకరించింది. పాక్ బౌలర్లలో నష్రా సంధు 3, రమీన్ షమీమ్ 2, సాదియా ఇక్బాల్ 2, ఫాతిమా సనా 2 వికెట్స్ పడగొట్టారు.
Also Read: Guru Gochar 2025: దీపావళి ముందు బృహస్పతి సంచారం.. ఆ 4 రాశుల వారికి ‘స్వర్ణకాలం’ మొదలు!
మోస్తరు లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఏ దశలోనూ ఆధిపత్యం చెలాయించలేదు. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్ (35) టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లు ఎవరూ పోరాడలేదు. కొందరు అయితే ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. రమీన్ షమీమ్ (15), ఫాతిమా సనా (11), నష్రా సంధు (11) విఫలం జట్టుపై ప్రభావం చూపింది. ఆసీస్ బౌలర్ల దెబ్బకు సదాఫ్ షామాస్ (5), మునీబా అలీ (3), సిద్రా నవాజ్ (5), నటాలియా (1), ఈమాన్ ఫాతిమా (0) సింగిల్ డిజిట్ స్కోర్ మాత్రమే చేశారు. కిమ్ గార్త్ (3), మేగాన్ షట్ (2), అనాబెల్ సదర్లాండ్ (2) పాక్ పతనాన్ని శాసించారు. ఈ ఓటమితో టోర్నీలో పాక్ పూర్తిగా వెనకపడిపోయింది. సెమీస్ చేరే అవకాశాలు దాదాపుగా లేనట్లే. ఇక పాక్ మహిళలు ఇంటికి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే.
