విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడం, విద్యార్థుల హాజరు నిర్వహణలో అవకతవకలు, ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేయడంపై మోహన్‌బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ రూ.15 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అలాగే, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26,17,52,872 తిరిగి చెల్లించాలని గత నెల 17న కమిషన్ ఆదేశాలు జారీ చేసి, ఆ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ క్రమంలో మీడియాలో వస్తున్న వార్తలపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్ మంచు విష్ణు ప్రకటన విడుదల చేశారు. ఉద్దేశపూర్వకంగా మీడియాలో ప్రసారం చేస్తున్న నిరాధార వార్తలను నమ్మొద్దని తెలిపారు.
‘‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (APHERMC) చేసిన కొన్ని సిఫార్సుల గురించి వివిధ మీడియా మాధ్యమాలలో ప్రచారమవుతున్న వార్తలను ఉద్దేశించి ఈ ప్రకటన విడుదల చేస్తున్నాం. మోహన్‌బాబు విశ్వవిద్యాలయం ఈ సిఫార్సులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవి కేవలం సిఫార్సులు మాత్రమే. ఈ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణలో (సబ్-జ్యుడిస్) ఉంది. APHERMC సిఫార్సులకు వ్యతిరేకంగా విశ్వవిద్యాలయానికి అనుకూలంగా హైకోర్టు ‘స్టే’ ఉత్తర్వును జారీ చేసింది. కోర్టు ఉత్తర్వును ధిక్కరించి దీనిని పోర్టల్ లో పెట్టడం దురదృష్టకరం. APHERMC చేసిన సిఫార్సులు సరికాదని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం గట్టిగా విశ్వసిస్తోంది’’
‘‘విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసిన సమాచారాన్ని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలను నమ్మొద్దని తల్లిదండ్రులకు, మీడియాకు తెలియజేస్తున్నాము. విచారణ సమయంలో మోహన్ బాబు యూనివర్శిటీ బృందం పూర్తిగా సహకరించిందని అదే కమిషన్ తన నివేదికలో పేర్కొనడం చూస్తే, ఎలాంటి తప్పు జరగలేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. మాకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్న వేలాది తల్లిదండ్రులకు, విద్యార్థులకు హృదయపూర్వక ధన్యవాదములు. మా ఛాన్సలర్ డాక్టర్ ఎం.మోహన్ బాబు మార్గదర్శకత్వంలో మేము ప్రపంచ స్థాయి సమగ్ర విద్యను అందిస్తూ యువతను శక్తిమంతం చేసే ప్రయత్నాన్ని కొనసాగిస్తాం’’ అని మంచు విష్ణు తెలిపారు.
ఐదు యూనివర్సిటీలకు వీసీలను నియమించిన ప్రభుత్వం
ఏపీలోని 5 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించారు. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆచార్య నాగార్జున వర్సిటీ వీసీగా వెంకట సత్యనారాయణరాజు సమంతపుడి .
శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వీసీగా టాటా నర్సింగరావు .
వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ వీసీగా బి.జయరామిరెడ్డి
జేఎన్టీయూ(విజయనగరం) వీసీగా వెంకటసుబ్బారావు .
యోగి వేమన విశ్వవిద్యాలయం(కడప) వీసీగా రాజశేఖర్ బెల్లంకొండ
The post Manchu Vishnu: మోహన్ బాబు యూనివర్సిటీ జరిమానాపై ప్రకటన విడుదల చేసిన మంచు విష్ణు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
