జైష్ ఉగ్రసంస్థ కొత్త వ్యూహాం.. అలాంటి ముస్లిం అమ్మాయిలే టార్గెట్!
పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ సరికొత్త వ్యూహాం అమలు చేస్తుంది. భావోద్వేగ, మతపరమైన విజ్ఞప్తి ద్వారా సరిహద్దు వెంబడి ఉన్న విద్యావంతులైన ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యూహం అమలు చేసిందని భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఇటీవల వెలువడిన ఉర్దూ ప్రచార సామగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్ శ్లోకాలతో పాటు మహిళలను ప్రేరేపించడానికి భావోద్వేగ ప్రసంగాలు ఇస్తున్నారు. రోజువారీ ప్రార్థనలు, దాతృత్వం, “హిజాబ్” ద్వారా ముస్లిం మతానికి సేవ చేయాలని జమాతుల్-ముమినాత్ పిలుపునిస్తూ మహిళలను బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాద నెట్‌వర్క్‌లోకి చేర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, 2004 నుంచి చురుకుగా ఉన్న ఈ సంస్థ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని అనుమానాస్పద మహిళలను లక్ష్యంగా చేసుకుంటోందని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఉగ్ర సంస్థ వాట్సాప్, టెలిగ్రామ్, మదర్సా నెట్‌వర్క్‌ల ద్వారా చిన్న గ్రూపులుగా విడిపోయి పని చేస్తుందన్నారు. ఈ సంస్థ పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలకు గల ఆధారాలు సైతం కూడా కనుగొనబడ్డాయి.
హైడ్రా కూల్చివేతల పాపం అధికారులదే..
హైడ్రా ధనవంతుల కట్టడాలను కూల్చడం లేదని.. కేవలం సామాన్యుల ఇళ్లను కూలుస్తోందని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కూల్చడం తప్ప ఇప్పటివరకు చేయగలిగింది ఏం లేదన్నారు… అన్ని అనుమతులు తీసుకుని కట్టుకున్న ఇళ్లను కూడా కూలుస్తున్నారని గుర్తు చేశారు. చెరువులు, కుంటలను మొత్తం కబ్జాలు చేస్తున్నారన్నారు.. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న వారికి కజ్జా భూములకు సైతం అనుమతిలిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు కబ్జా ఆక్రమణలు, నిర్మాణాలపై హెచ్ఎండీఏ, రేరాకు సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదే అంశంపై అసెంబ్లీలో కూడా పలుమార్లు ప్రస్తావించానన్నారు. హైడ్రా కూల్చివేతల పాపం అధికారులదే.. ప్రభుత్వం మమ్మల్ని ఏమీ చేయలేదని ప్రభుత్వ అధికారులు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. హైడ్రా తీరు, కబ్జాలతో నేను వేసిన రిట్ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయమని ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తూ హైడ్రా, రెరా, HMDA, GHMC లకు నోటీసులు జారీ చేయమని చెప్పారు. విచారణను హైకోర్టు 30 వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం..!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.. దేశ చరిత్రలో ఏపీలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడికి ఆమోదం తెలపనుంది కేబినెట్.. రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.. రేపటి కేబినెట్ లో మొత్తంగా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించనుంది.. 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, అమరావతిలో రూ.212 కోట్లతో నిర్మించనున్న గవర్నర్ నివాసం రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదముద్ర వేయనున్నారు.. కృష్ణా నది ఒడ్డున అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా రాజ్ భవన్ నిర్మాణం జరగనుంది.
నాపై దాడి కొందరికి నాటకమైంది.. అసహనం వ్యక్తం చేసిన సైఫ్
బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ ఏడాది జనవరిలో ఒక దుండగుడి దాడిలో గాయపడ్డ విషయం తెలిసిందే. వారం రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. తాజాగా, ఈ ఘటన గురించి ఓ టాక్ షోలో సైఫ్ స్పందిస్తూ.. ‘కొందరు ఈ దాడిని నాటకంగా చూపారని, నిజానికి ఈ సమస్య సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం అని అన్నారు. “ఇలాంటి సమాజంలో మనం జీవిస్తున్నాం, ఇలాంటి సందర్భంలో కొందరు నిజాన్ని అర్థం చేసుకోరు” అని ఆయన అన్నారు.
యూపీలో విమాన ప్రమాదం.. టేకాఫ్ అవుతుండగా కూలిన ప్రైవేటు విమానం
ఉత్తరప్రదేశ్‌లో విమాన ప్రమాదం జరిగింది. ఫరూఖాబాద్‌లో టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రైవేట్ విమానం నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఇందులో ఉన్న ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గురువారం ఉదయం ఫరూఖాబాద్‌లోని మొహమ్మదాబాద్ ఎయిర్‌స్ట్రిప్ దగ్గర ఒక ప్రైవేట్ విమానం రన్‌వేపై నుంచి జారిపడి సరిహద్దు గోడకు కొద్ది దూరంలో ఆగిపోయడంతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానంలో నలుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు సహా ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. విమానంలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాలేదు!
అఫ్గానిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ఫార్మాట్‌లో 200కు పైగా వికెట్లు తీసిన తొలి అఫ్గాన్ బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్స్ పడగొట్టడంతో రషీద్ ఖాన్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు 27 ఏళ్ల ఈ స్పిన్నర్‌కు ఒక వికెట్ అవసరం అయింది. 39వ ఓవర్ చివరి బంతికి మెహిదీ హసన్ మిరాజ్‌ను అవుట్ చేయడంతో 200 వికెట్స్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు.
28 మంది బంగ్లాదేశీయుల అరెస్ట్.. అక్రమంగా దేశంలోకి
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత ప్రభుత్వం.. దేశంలోని అక్రమ వలసదారుల ఏరివేత పై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నివాసితుల సంక్షేమ సంఘాలను విదేశీ దేశాలకు స్థలాలను నియమించడం లేదా అద్దెకు ఇవ్వడం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. “అక్రమ బంగ్లాదేశ్ వలసదారుల”పై పెద్ద ఎత్తున దాడిలో భాగంగా మూడు వేర్వేరు జిల్లాల్లో 28 మందిని అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా.. ఆగ్నేయ పోలీసు జిల్లాలో ఇద్దరు మైనర్లతో సహా 11 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. రాజధానిలో అక్రమంగా నివసిస్తున్న 13 మంది బంగ్లాదేశ్ జాతీయులను దక్షిణ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ప్రారంభంలో వాయువ్య జిల్లా నుండి నలుగురు బంగ్లాదేశ్ వలసదారులను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దేశంలోని వివిధ నగరాల్లోని అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పోలీసులు, ఇతర అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా సౌత్ ఈస్ట్ డిస్ట్రిక్ట్ పోలీసులు 28 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను గుర్తించి అరెస్టు చేసింది. వారు భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించింది.
దశలవారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం.. డిప్యూటీ సీఎం ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ (HAM) రోడ్ల నిర్మాణ పనులను దశలవారీగా వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సూచించారు. గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. హ్యామ్ రోడ్ల నిర్మాణ ప్రక్రియలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రోడ్ల రూపకల్పనలో ట్రాఫిక్ సర్వేలను పరిగణనలోకి తీసుకోవాలని, రోడ్లు ఎక్కువగా ఉపయోగించే ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హ్యామ్ ప్రాజెక్ట్ మొదటి దశకు సంబంధించిన టెండర్లను అతి త్వరలో పిలవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణం పారదర్శకంగా, నాణ్యతతో కూడిన విధంగా జరగాలని ఆయన పేర్కొన్నారు. అధికారులు, శాఖ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన
బీహార్‌లో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. షెడ్యూల్ కంటే ముందే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోగా.. ప్రస్తుతం ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో ఇప్పుడు మరింత వేగం పుంజుకుంది. అన్ని పార్టీలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు హామీలు కుమ్మరించారు. తాజాగా ఆ జాబితాలో ఆర్జేడీ కూడా చేరింది. యువతే లక్ష్యంగా తేజస్వి యాదవ్ అతి పెద్ద సంచలన హామీ ప్రకటించారు. తేజస్వి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి రాగానే అన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని అతి పెద్ద హామీ ప్రకటించారు. తన వాగ్దానానికి ఎలాంటి ఢోకా లేదని.. డేటా ఆధారంగానే ఈ హామీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యత తనదేనని తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. అది కూడా ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు అందుకు వీలుగా చట్టం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. బీహార్‌లో ఉద్యోగం లేని ఇల్లు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొన్నారు.
హైకోర్టులో షాకింగ్ వాదనలు.. రాష్ట్రపతి ఆమోదం లేకపోయినా రిజర్వేషన్లు చట్టబద్ధమే..
బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి హాజరై, హైకోర్టుకు ప్రభుత్వ నిర్ణయాలను వివరించారు. ఏజీ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర కేబినెట్ బీసీ జనగణన నిర్వహించాలనే నిర్ణయం తీసుకుందని తెలిపారు. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 57.6 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు ఏజీ తెలిపారు. ఈ తీర్మానం సామాజిక న్యాయం దిశగా ముఖ్యమైన అడుగని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలపకపోయినా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అది చట్టబద్ధమైనదే అని ఏజీ పేర్కొన్నారు. “రాష్ట్రపతి ఆమోదం లేని స్థితిలో కూడా బిల్లు చెల్లుబాటు అవుతుంది” అని వివరించారు. గవర్నర్ నిర్దిష్ట గడువులో ఆమోదం తెలపకపోతే చట్టంగా పరిగణించాల్సి ఉంటుందని, దీనికి ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ అవసరం లేదని ఏజీ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
