Nobel Peace Prize 2025: అగ్రరాజ్యాధిపతి మనసు నోబెల్ శాంతి బహుమతి వైపు మళ్లింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు విభాగాల్లో నోబెల్ బహుమతులు ప్రకటించారు. ట్రంప్ ఆశగా ఎదురు చూస్తున్న నోబెల్ శాంతి బహుమతిని శుక్రవారం నార్వేలోని ఓస్లోలో ఉన్న నోబెల్ కమిటీ ప్రకటిస్తుంది. ఇంతకీ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందా..
READ ALSO: Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన కథతో ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్..
8 యుద్ధాలు ఆపానని చెబుతున్న ట్రంప్..
పలు సందర్భాల్లో ప్రపంచ వేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాను ఎనిమిది యుద్ధాలను ఆపినందుకు, తాను నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని పదేపదే చెబుతూ వచ్చారు. అయితే ట్రంప్ వాదనలపై నిపుణుల అభిప్రాయం పూర్తిగా భిన్నంగా ఉంది. ట్రంప్‌ను నోబెల్ కమిటీ ఎంపిక చేయదని పలువురు నిపుణులు చెబుతున్నారు. అణ్వాయుధ దేశాలైన భారతదేశం – పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు తాను మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ఇప్పటి వరకు 50 సార్లకు పైగా పేర్కొన్నారు. కానీ ఈ వాదనను భారత్ ఖండించింది. స్వీడిష్ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు పీటర్ వాలెన్‌స్టెయిన్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది నోబెల్ బహుమతిని అందుకోరనే అభిప్రాయం వ్యక్తం చేశారు. బహుమతి ప్రకటించే నాటికి గాజా యుద్ధం ఆగిపోయి ఉంటుంది కాబట్టి, వచ్చే ఏడాది ఆయన కల నెరవేరవచ్చని అన్నారు. ప్రస్తుతానికి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రశ్న ఆసక్తిగా మారింది.. ట్రంప్ నోబెల్ బహుమతి గెలుచుకోకపోతే, ఎవరు గెలుస్తారు.
రేసులో ఎవరు ఉన్నారో తెలుసా?
ఈ ఏడాది, నోబెల్ శాంతి బహుమతికి 338 మంది వ్యక్తులు, సంస్థలు నామినేట్ అయ్యాయి. నోబెల్ కమిటి విజేత పేరు శుక్రవారం వెల్లడించనుంది. ఎవరెవరి పేర్లు బహుమతి కోసం వచ్చాయో రాబోయే 50 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచనున్నారు. గత ఏడాది నోబెల్ శాంతి బహుమతి నిహాన్ హిడాంక్యోకు ప్రదానం చేశారు. ఈ ఏడాది బహుమతిని గెలుచుకునే ప్రధాన పోటీదారుల గురించి ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ ప్రధాన పోటీదారులలో యుద్ధం, కరువు సమయాల్లో పౌరులకు సహాయం చేయడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టే స్వచ్ఛంద సేవకుల నెట్‌వర్క్ అయిన సూడాన్ అత్యవసర ప్రతిస్పందన బృందం కూడా ఉంది. రష్యన్ ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవాల్నీ భార్య యులియా నవల్నాయ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రసిద్ధ ఎన్నికల మానిటర్ అయిన ఆఫీస్ ఫర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ (OSCE) కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం.
పాలస్తీనాలో సహాయ కార్యక్రమాలకు గణనీయంగా సహాయం చేసిన నేపథ్యంలో ఐక్యరాజ్య కమిటీ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ (UNHCR) లేదా UN రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (UNRWA) లను ఎంపిక చేయవచ్చనే వాదనలు వినిపిస్తు్న్నాయి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, అంతర్జాతీయ న్యాయస్థానం లేదా కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ లేదా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి ప్రెస్ మానిటరింగ్ సంస్థలకు ప్రదానం చేయవచ్చని చెబుతున్నారు. ఈ సంవత్సరం నోబెల్ కమిటీ ఊహించని వ్యక్తిని శాంతి బహుమతికి ఎంపిక చేయవచ్చనే మరొక వాదన కూడా వినిపిస్తుంది.
బహుమతిగా ఎన్ని మిలియన్ డాలర్లు అంటే..
ఈ అవార్డులను ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు. ప్రతి బహుమతితో 11 మిలియన్ల స్వీడిష్ క్రోనర్లు (సుమారు US$1.2 మిలియన్లు) అందజేస్తారు. విజేతలకు 18 క్యారెట్ల బంగారు పతకం, ప్రశంసా పత్రం కూడా అందజేస్తారు. ప్రతి అవార్డుకు గరిష్టంగా ముగ్గురు విజేతలు బహుమతి డబ్బును పంచుకోవచ్చు.
READ ALSO: Digital Gold: మీ ఇళ్లు బంగారం కాను.. డిజిటల్ బంగారం గురించి తెలుసా!
