2021లో ఆఫ్ఘనిస్తాన్‌లో పౌర ప్రభుత్వాన్ని దించి తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అప్పటి నుంచి భారత్-ఆఫ్ఘాన్ మధ్య తెరవెనక దౌత్య సంబంధాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికీ, తాలిబాన్ ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. కానీ, ఇప్పుడు మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ఆఫ్ఘాన్ అవసరం భారత్‌కు ఎంతో ఉంది. అదే విధంగా తాలిబాన్లకు కూడా భారత్ కావాలి. ఈ నేపథ్యంలోనే, తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో ముత్తాకీ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.
తాలిబాన్ నేత పర్యటనపై పాక్ పరిశీలన..
అయితే, భారత్-ఆఫ్ఘాన్‌లు దగ్గర కావడం పాకిస్తాన్‌కు నచ్చడం లేదు. తాలిబాన్ మంత్రి భారత్ పర్యటనకు వస్తుంటే, పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఈ పరిణామాలను పాక్ నిశితంగా గమనిస్తోంది. పాకిస్తాన్ నిపుణుడు నజామ్, ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్‌లో రాసిన ఒక వ్యాసంలో.. తాలిబాన్ మంత్రిపై యూఎన్ ట్రావెల్ బ్యాన్ ఎత్తేయడం దక్షిణాసియా దౌత్యంలో ముఖ్యమైందని రాశాడు. రష్యాతో సమావేశాల తర్వాత ముత్తాకీ భారత పర్యటన, ఆఫ్ఘాన్ ప్రాంతీయ సంబంధాలను పునరుద్ధరించాలనే ఉద్దేశాన్ని సూచిస్తోందని అన్నారు. ఈ పరిణామం పాకిస్తాన్‌కు వ్యూహాత్మక, మానవతా, భద్రతాపరమైన చిక్కుల్ని తెస్తాయని వ్యాసంలో చెప్పుకొచ్చారు.
భారత్-ఆఫ్ఘాన్‌ల మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. 2001 తర్వాత భారత్, ఆ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యంపై 3 బిలియన్ డాలర్లనున ఖర్చు చేసింది. అయితే, 2021లో తాలిబాన్లు తిరిగి రావడంతో, భారత్ కాబూల్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసేసింది. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన ఒక ఏడాది తర్వాత నుంచి మానవతా సాయాన్ని భారత్ అందిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు గాడినపడ్డాయి.
భయపడుతున్న పాకిస్తాన్:
అయితే, ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఆసక్తికి భారత్ కారణమని పాకిస్తాన్ భావిస్తోంది. భారత్, తమ దేశానికి వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్ ను వాడుకుంటుందని భయపడుతోంది. ముఖ్యంగా, తాలిబాన్‌లో భారత సంబంధాలు, బలూచిస్తాన్లో ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)’’, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) మరింత బలోపేతం అవుతాయని పాక్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఇప్పటికే, పాక్-ఆఫ్ఘాన్ల మధ్య డ్యూరాండ్ లైన్ రూపంలో వివాదం ఉంది. శత్రవుకు శత్రువు మిత్రుడనే సూత్రాన్ని భారత్ ఇక్కడ వర్తింప చేస్తుందనేది పాకిస్తాన్ అనుమానం.
ఇదే కాకుండా, పాకిస్తాన్ వ్యాప్తంగా ఇటీవల కాలంలో గుర్తుతెలియని వ్యక్తులు, భారత వ్యతిరేక ఉగ్రవాదుల్ని హతమారుస్తున్నారు. ఈ దాడులకు పాకిస్తాన్‌లో ఉంటున్న ఆఫ్ఘాన్ శరణార్థులే కారణమని పాక్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. పాక్ తాలిబాన్లకు, ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తోందని విమర్శిస్తోంది. ఇక పాకిస్తాన్, చైనాల ఎకనామిక్ కారిడార్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌పై భారత్ దృష్టికి ఆఫ్ఘాన్ స్నేహం సహకరించనుంది.
