PM Modi: యూకే ప్రధాని కీర్ స్టార్మర్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మోడీ, ఖలిస్తానీ తీవ్రవాదాన్ని యూకే ప్రధాని ముందు లేవనెత్తినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ‘‘రాడికలిజం, హింసాత్మక తీవ్రవాదానికి ప్రజాస్వామ్య సమాజాలలో స్థానం లేదని, సమాజాలు అందించిన స్వేచ్ఛలను ఉపయోగించడానికి లేదా దుర్వినియోగం చేయడానికి అనుమతించరాదని ప్రధాన మంత్రి మోదీ నొక్కి చెప్పారు. రెండు వైపులా అందుబాటులో ఉన్న చట్టపరమైన చట్రంలో వాటిపై చర్య తీసుకోవలసిన అవసరం ఉందని మోడీ, యూకే ప్రధానితో అన్నారు’’ అని మిస్రీ వెల్లడించారు.
Read Also: Actress Ramya: నటికి అసభ్యకర మెసేజ్‌లు.. 12 మందిపై చార్జిషీట్ దాఖలు! ప్రధాన నిందితుడు సూపర్ స్టార్
ఈ పర్యటనను ‘‘ప్రజల మధ్య భాగస్వామ్యం’’గా మిస్రీ అభివర్ణించారు. భారత్, యూకే రెండు దేశాల పౌరులకు ప్రయోజనం చేకూర్చడానికి బహుళ రంగాలలో కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) భారతదేశ వికసిత్ భారత్ దార్శనికతకు మద్దతు ఇస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు.
భారత్‌ను సందర్శిస్తున్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసలు గుప్పించారు. త్వరలోనే భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ధ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. 125 మంది వ్యాపారులు, ప్రతినిధుల బృందంతో స్టార్మర్ భారత పర్యటనకు వచ్చారు. యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశానికి యూకే మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.
