Witchcraft: మూఢనమ్మకాలు ముగ్గురి ప్రాణాలను తీశాయి. జార్ఖండ్‌లో మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపారు. రాష్ట్రంలోని లోహార్డాగా జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. పెష్రార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేక్రాంగ్ బార్టోలి గ్రామంలో బుధవారం రాత్రి ఈ హత్యలు జరిగాయి. మృతులను లక్ష్మణ్ నగేసియా (47), అతని భార్య బిఫాని నగేసియా (45), వారి తొమ్మిదేళ్ల కుమారుడు రాంవిలాస్ నగేసియాగా గుర్తించారు.
Read Also: PM Modi: ఖలిస్తానీలపై చర్యలు తీసుకోండి..యూకే పీఎంను కోరిన మోడీ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దాడి చేసిన వ్యక్తులు గొడ్డలి, పార వంటి పదునైన ఆయుధాలను ఉపయోగించి వారి గొంతు కోసినట్లు చెప్పారు. బాధితులు నిద్రిస్తున్న సమయంలోనే ఈ హత్యలు జరిగినట్లు వెల్లడించారు. హత్యల తర్వాత దుండగులు ఇంటికి బయట నుంచి తాళం వేసి పారిపోయారు. గురువారం ఉదయం కుటుంబం చాలా సేపు అయినా తలుపులు తెరవకపోవడంతో పొరుగువారి ద్వారా ఈ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది.
పెష్రార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ నేతృత్వంలోని పోలీస్ బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి పంపారు. సంఘటన జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్నారు. ప్రాణాలతో కేవలం సుఖ్మానియా నాగేసియా అనే మహిళ బయటపడింది. తమ కుటుంబం మంత్రాలు చేస్తుందని కొంత మంది గ్రామస్తులు వేధిస్తున్నారని పోలీసులకు చెప్పింది. గతంలో ఇదే విషయమై పంచాయతీ కూడా జరిగినట్లు వెల్లడించింది. అన్ని కోణాల్లో కేసును పరిశీలించి, నిందితులను త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
