IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా, టీమిండియా ప్రస్తుతం రెండో టెస్ట్ కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలోకి చేరుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ తేడాతో ముగించిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు, నేటి (అక్టోబర్ 10) నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా సులభ విజయం సాధించిన భారత్, రెండో టెస్ట్‌లోనూ అదే రీతిలో ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. అయితే, శుక్రవారం జరిగే మ్యాచ్ తొలి రోజు వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉష్ణోగ్రత 25 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్‌లో ఉదయం వేళల్లో కొద్దిగా గాలి వీచే అవకాశం ఉండటంతో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం లభించవచ్చు. అయినప్పటికీ, ఢిల్లీ పిచ్ ఎప్పటిలాగే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి మాత్రం బ్యాట్స్‌మెన్‌కి కూడా సౌకర్యంగా ఉండే పిచ్‌గా కనిపిస్తోంది. అందువల్ల, ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడం మంచి నిర్ణయం కానుంది.
Pawan Kalyan : ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతే రాజకీయాలు వదిలేస్తా..
తొలి టెస్ట్ త్వరగా ముగియడంతో బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఐదు రోజుల విశ్రాంతి లభించినప్పటికీ, అతని వర్క్ లోడ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. బుమ్రా బదులు యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉంది. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారత్ ప్లేయింగ్-11లో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉండే అవకాశం ఉంది.
అరుణ్ జైట్లీ స్టేడియం టీమిండియాకు కోటగా ఉంది. గత 38 సంవత్సరాలుగా ఈ మైదానంలో భారత్ ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. చివరిసారి భారత్ ఇక్కడ ఓటమి చవిచూసింది 1987లో అది కూడా వెస్టిండీస్ చేతుల్లోనే. ఆ తర్వాత భారత్ ఈ మైదానంలో ఆడిన 13 టెస్టుల్లో 11 గెలుపులు సాధించి, 2 డ్రా చేసుకుంది. అయితే 1987 నాటి వెస్టిండీస్ జట్టుకు, ఇప్పటి 2025 జట్టుకు చాలా తేడా ఉంది. తొలి టెస్ట్‌లో పూర్తిగా నిరాశపరిచిన కరీబియన్ జట్టు, రెండో టెస్ట్‌లో గట్టి పోరాటం ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఇక హెడ్-టు-హెడ్ రికార్డుల పరంగా వెస్టిండీస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లుగా భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు భారత్-వెస్టిండీస్ జట్లు 101 టెస్టుల్లో తలపడ్డాయి. అందులో భారత్ 24 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 30 విజయాలు సాధించింది. 47 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Astrology: అక్టోబర్ 10, శుక్రవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏం చేయాలంటే..?
