Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

‘లోకల్‌’కు బ్రేక్‌.. రెండురోజుల ఉత్కంఠకు తెర.. స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే

Ai generated article, credit to orginal website, October 10, 2025

జీవో-9పై ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు
తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసిన ధర్మాసనం

హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌ పడింది. ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు (High Court) స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. స్థానిక సంస్థల పదవుల్లో బీసీ రిజర్వేషన్లను 25 నుంచి 42 శాతానికి పెంచుతూ వెలువరించిన జీవో 9తోపాటు, ఆ జీవోకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ అమలును నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు జారీచేసేవరకు స్టే ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ధర్మాసనం ప్రకటించింది.
ఎన్నికల నిలుపుదలకు గల కారణాలను వివరిస్తూ పూర్తి వివరాలతో పాయింట్ల వారీగా ఉత్తర్వులను తర్వాత వెలువరిస్తామని తెలిపింది. బీసీ రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ వ్యతిరేకమని, రాష్ట్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుందంటూ దాఖలైన వ్యాజ్యాల్లో ప్రతివాదులైన బీసీ సంక్షేమం, పంచాయతీరాజ్‌, సాధారణ పరిపాలన, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులకు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ధర్మాసనం నోటీసులు జారీచేసింది. నాలుగు వారాల్లోగా తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం వేసే కౌంటర్లలోని అంశాలపై అభ్యంతరాలు ఉంటే పిటిషనర్లు రిప్లయ్‌ కౌంటర్లను దాఖలు చేయవచ్చని, ఇందుకు రెండు వారాల గడువు ఇస్తున్నామని పేర్కొన్నది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
నోటిఫై అవసరం లేదు.. ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున గురువారం ముందుగా అడ్వకేట్‌ జనరల్‌ ఏ సుదర్శన్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది రవివర్మకుమార్‌ వాదనలు వినిపించారు. ఏజీ వాదిస్తూ.. డెడికేటెడ్‌ కమిషన్‌ నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని బీసీ జనాభా 57.6 శాతమని తేలిందని చెప్పారు. ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదించి, మార్చి 30న గవర్నరుకు పంపిందని తెలిపారు. ఆ బిల్లు ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నదన్నారు. గవర్నర్‌ ఆమోదం తెలిపితే ప్రభుత్వం నోటిఫై చేయాల్సి వచ్చేదని, గవర్నర్‌ ఆమోదించని పక్షంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బిల్లుకు ఆమోదం పొందినట్టుగానే పరిగణించాల్సి ఉంటుందని గుర్తుచేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరంలేదని, చట్టం అమల్లోకి వచ్చినట్టేనని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల వ్యవహారంపై ఆర్డినెన్స్‌ జారీచేస్తే దానికి కూడా రాష్ట్రపతి నుంచి ఆమోదం రాలేదని చెప్పారు.
ఆర్డినెన్స్‌కు అనుగుణంగా ఆగస్టు 31న శాసనసభ చట్టం చేసిందన్నారు. ఈ చట్టానికి కూడా గవర్నర్‌ ఆమోదం తెలుపలేదని చెప్పారు. రవికుమార్‌ వర్మ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర జనాభాలో ఎస్టీలు 10.43 శాతం, ఎస్సీలు 17.42 శాతం, బీసీలు 57.6 శాతం చొప్పున ఉన్నారని తెలిపారు. అయినా రిజర్వేషన్లు మొత్తం 50 శాతానికి మించరాదనే వాదన అన్యాయమన్నారు. ఈ మూడు వర్గాల జనాభాకు 67 శాతం రిజర్వేషన్లు అమలు చేశాక మిగిలిన 33 శాతం పదవులను కేవలం 15 శాతం ఉన్న ఉన్నత కులాలకు దకడం కూడా అన్యాయమేనని అన్నారు. ఇప్పటివరకు 50 శాతం పదవులను 15 శాతమున్న ఉన్నత కులాల వాళ్లు అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంపుదల చేయడం వల్ల వచ్చే నష్టమేమీ లేదని చెప్పారు.
ఇంప్లీడ్‌ పిటిషన్లకూ అనుమతి
ఈ కేసులో ప్రధాన పిటిషన్‌లతోపాటు ఇంప్లీడ్‌ అయిన 30 పిటిషన్లను కూడా విచారణకు అనుమతిస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ల కల్పన జీవో 9ని సవాలు చేస్తూ సామాజిక కార్యకర్త బుట్టెంగారి మాధవరెడ్డి, పెద్దపల్లి జిల్లా మహాముత్తారం మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన సముద్రాల రమేశ్‌, సిద్దిపేట జిల్లా కొండూరుకు చెందిన జల్లపల్లి మల్లవ్వ, నల్లగొండ జిల్లా చింతపల్లికి చెందిన గోరటి వెంకటేశ్‌ తదితరులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్లను ఏ,బీ,సీ,డీలుగా వర్గీకరించాకే 42 శాతం రిజర్వేషన్ల అమలుతో ఎన్నికలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ వికారాబాద్‌ జిల్లా ధరూర్‌ గ్రామానికి చెందిన మడివాల మచ్చదేవ రజకుల సంఘం ప్రధానకార్యదర్శి ఎన్‌ లక్ష్మయ్య మరో పిటిషన్‌ వేశారు.
కులాలతో సంబంధం లేకుండా రైతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లికి చెందిన న్యాయవాది శాంతప్ప, రైతు సంఘాల సమాఖ్య వేర్వేరుగా వ్యాజ్యాలను దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధమేనని, ఈ కేసుల్లో తమ వాదనలు కూడా వినాలంటూ సుమారు 30 వరకు ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్‌ నాయకులు వీ హనుమంతరావు, మెట్టు సాయికుమార్‌, చరణ్‌కౌశిక్‌ యాదవ్‌, ఇందిరా శోభన్‌, లక్ష్మణ్‌ యాదవ్‌, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు టీ చిరంజీవులు, బీజేపీ ఎంపీ, బీసీ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వేర్వేరుగా ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారు. ప్రధాన పిటిషన్లతోపాటు అన్ని ఇంప్లీడ్‌ పిటిషన్లను విచారణకు అనుమతిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకం: పిటిషనర్లు
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, జే ప్రభాకర్‌, కే వివేక్‌రెడ్డి తదితరులు జీవో 9 అమలును నిలిపివేస్తూ స్టే ఆదేశాలివ్వాలని కోరారు. సొంత చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి జీవో 9ని జారీ చేశారని తెలిపారు. దీంతో మొత్తం రిజర్వేషన్లు 67 శాతానికి పెరిగాయని, ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. మరోకేసులో సుప్రీంకోర్టు ట్రిపుల్‌ టెస్ట్‌ పాటించకపోవడాన్ని తప్పుపట్టిందని గుర్తుచేశారు. రాకేశ్‌కుమార్‌ కేసులో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, మేఘాలయ, మిజోరం వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో ఎస్టీలకు మినహాయింపు ఇచ్చిందని తెలిపారు. బీసీలకు అలాంటి మినహాయింపు ఏమీ లేదన్నారు.
రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీల జనాభా కూడా పెరిగిందని, వాళ్లకు మాత్రం రిజర్వేషన్లు పెంచలేదని చెప్పారు. 2024నాటి బీసీ జనాభా లెకలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెకలనే ప్రామాణికంగా తీసుకుని ఆ వర్గాలకు అన్యాయం చేసిందని చెప్పారు. రాజ్యాంగ అధికరణ 243డీ ప్రకారం చట్టం లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వరాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా దానికి గవర్నర్‌ ఆమోదం లభించలేదని, ఆర్డినెన్స్‌ విషయంలోనూ రాజ్యాంగ అధినేత ఆమోదం లేదని, ఈ నేపథ్యంలో జీవో 9 అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు జీవో 9, ఎస్‌ఈసీ గత నెల 29న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ స్టే ఆదేశాలిచ్చింది.
ప్రభుత్వం రెండు నాల్కలు
బీసీలకు రిజర్వేషన్లు పెంచామని చెప్పుకొని, రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తేలిపోయింది. ఇందుకు హైకోర్టులో చేసిన వాదనలనే ఉదాహరణగా చూపుతున్నారు. రిజర్వేషన్ల పెంపు, ఎన్నికల షెడ్యూల్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు గత నెల 27వ తేదీన స్టే ఇవ్వబోయింది. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీఅయిన తర్వా త కూడా కోర్టులు జోక్యం చేసుకోవచ్చునని ప్రభుత్వం గట్టిగా వాదించింది. దీంతో కోర్టు స్టే ఆదేశాలు ఇవ్వలేదు.
కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌, నోటిఫికేషన్లను ప్రకటించింది. గురువారం వాదనల సందర్భంగా ‘ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోడానికి వీలులేదని రాజ్యాంగంలోని 243-వో స్పష్టం చేస్తున్నది’ అని ప్రభుత్వం వాదించింది. అంటే.. ముందుగా తాను చేసిన వాదనలకు తానే విరుద్ధంగా వాదించింది. దీనిపై న్యాయ నిపుణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే తన వాదనలను స్వయంగా ఖండించుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ధర్మాసనం ఆదేశాల నేపథ్యంలో ఆరు వారాల వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌ పడినట్లేనని న్యాయ నిపుణులు అంటున్నారు.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • CM Chandrababu: లండన్ లో పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం
  • Minister Nara Lokesh: రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు – మంత్రి నారా లోకేష్
  • Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంకర లారీ ! 20 మంది మృతి !
  • Inter Colleges: ఈ నెల 15 వరకు ఇంటర్ కాలేజీల్లో తనిఖీలు
  • KTR: పేదల ఇళ్లపైకే హైడ్రా బుల్డోజర్లు – కేటీఆర్‌

Recent Comments

No comments to show.

Archives

  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2025 Information Bazaar | WordPress Theme by SuperbThemes