కరూర్ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు(CBI) అప్పగిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు నిరాకరించడంతో పిటిషనర్లు సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. నిస్సందేహంగా.. న్యాయసమ్మతమైన, పక్షపాతరహిత విచారణ అనేది పౌరుల హక్కు అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దర్యాప్తుపై పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసినట్లు తెలిపింది.
కరూర్ తొక్కిసలాట నేపథ్యంలో పౌరుల ప్రాథమిక హక్కులపై జస్టిస్ జె.కె.మహేశ్వరి, ఎన్.వి.అంజరియాలతో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. దీనిపై అన్ని పార్టీలు వ్యక్తంచేస్తున్న అనుమానాలు తొలగాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని.. అందువల్లే ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రతినెలా కేసు పురోగతిని కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ దర్యాప్తునకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును విజయ్ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అస్రాగార్గ్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. పోలీసుల దర్యాప్తు, అధికారుల పాత్రపై తాము ఇదివరకే ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ.. రాష్ట్ర పోలీసు అధికారులతోనే మద్రాస్ హైకోర్టు సిట్‌ను ఏర్పాటుచేసిందని టీవీకే తన పిటిషన్‌లో పేర్కొంది. తమ పార్టీపై సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ కు నాయకత్వ లక్షణాల్లేవని, ఘటన జరిగిన వెంటనే ఆ పార్టీ నేతలంతా పారిపోయారని వ్యాఖ్యానించిన మద్రాసు హైకోర్టు… కరూర్ ఘటనపై ఆ పార్టీ తీరును తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఈవిషయాన్ని టీవీకే పార్టీ తన పిటిషన్‌లో ప్రస్తావించింది.
దీనితో విజయ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం సీబీఐ విచారణకు లైన్ క్లియర్ చేసింది. అదే సమయంలో… మద్రాస్ హైకోర్టును సుప్రీం కోర్టు మందలించింది. తమిళనాడులో రాజకీయ పార్టీల ర్యాలీలు, సభల కోసం ఒక ప్రామాణిక విధానాన్ని (SOP) రూపొందించాలనే అభ్యర్థనతో టీవీకే పిటిషన్ వేస్తే.. మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్(సింగిల్ బెంచ్) ఆ పార్టీ, ఆ పార్టీ అధినేత విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిని సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. విచారణ జరపకుండానే ఐపీఎస్ అధికారి అస్రా గార్గా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేయడం కూడా పిటిషన్ పరిధిని మించి వెళ్లడమేనని, పైగా డివిజనల్ బెంచ్‌లో ఉండగా సింగిల్ బెంచ్ అలాంటి ఆదేశాలు ఎలా ఇవ్వగలిగింది? అనే అభ్యంతరాలను సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యక్తం చేసింది.
రాహుల్ ఓటు చోరీ వ్యాఖ్యలపై పిల్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
ఎన్నికల జాబితాలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయంటూ లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల పలు సందర్భాల్లో ఆరోపించారు. ఆయన ఆరోపణలపై విచారణకు మాజీ జడ్జి సారథ్యంలో ప్రత్యేక విచారణ బృందం (SIT) ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని (PIL) సుప్రీంకోర్టు సోమవారంనాడు తోసిపుచ్చింది. ఈ అంశంపై ఎన్నికల కమిషన్ (ECI)ను ఆశ్రయించాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది.
‘పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన విన్నాం. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కింద దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు నిరాకరిస్తున్నాం. కావాలనుకుంటే ఈసీఐను పిటిషనర్ ఆశ్రయించవచ్చు’ అని ధర్మాసనం పేర్కొంది. బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఎన్నికల జాబితా అవకతవకలపై ఆగస్టు 7న రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఉటంకిస్తూ న్యాయవాది, కాంగ్రెస్ సభ్యుడు రోహిత్ పాండే ఈ పిటిషన్ వేశారు. ఎన్నికల జాబితా సన్నాహకాలు, నిర్వహణ, పబ్లికేషన్ విషయాల్లో ఈసీ పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టును ఆయన కోరారు. అర్ధవంతమైన వెరిఫికేషన్, ఆడిట్, పబ్లిక్ స్క్రూటినీకి వీలుగా మెషీన్-రీడబుల్ ఫార్మెట్‌లో ఎన్నికల జాబితాను పబ్లిష్ చేయాలని కూడా కోరారు.
కాగా, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతో ఏర్పడిందంటూ రాహుల్ పదేపదే విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. కొందరు పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రజల ఓటు హక్కును దొంగిలించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ విషయంలో బీజేపీ విజయవంతమైందని, అయితే బీహార్‌లో మాత్రం ఓట్ల చోరీ జరగనీయమన్నారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ నేతలతో పాటు ఎన్నికల కమిషన్ అధికారులు తోసిపుచ్చారు. రాహుల్ తన ఆరోపణలను తగిన ఆధారాలు చూపిస్తూ అఫిడవిట్‌తో ముందుకు రావాలని ఈసీ సూచించింది.
The post Karur Stampede: సీబీఐ చేతికి కరూర్ తొక్కిసలాట కేసు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
