ఇజ్రాయెల్-గాజా శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన నిరంతర శాంతి ప్రయత్నాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. గాజా నుంచి 20 మంది ఇజ్రాయెల్ బందీలు తిరిగి విడుదల కావడాన్ని స్వాగతించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో మోదీ తన స్పందన తెలియజేశారు.
‘రెండేళ్లకు పైగా చెరలో ఉన్న బందీలందరూ విడుదల కావడాన్ని మేము స్వాగతిస్తున్నాం. వారి కుటుంబ సభ్యుల ధైర్య సాహసాలకు, అధ్యక్షుడు ట్రంప్ నిరంతర శాంతి యత్నాలకు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు దృఢ సంకల్పానికి దక్కిన గౌరవం ఇది. ఈ ప్రాంతంలో శాంతి నెలకొనేందుకు చిత్తశుద్ధితో కృషి చేసిన అధ్యక్షుడు ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తున్నాం’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గత శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రధాని తాజా సందేశం ఇచ్చారు. కాల్పుల విరమణలో భాగంగా రెండేళ్లుగా పైగా బందీలుగా ఉన్న 20 మందిని హమాస్ సోమవారం ఉదయం విడిచిపెట్టింది. తొలుత ఏడుగురు బందీలను, ఆ తర్వత మరో 13 మందిని అప్పగించింది. ఒప్పందంలో భాగంగా 48 మంది ఇజ్రాయెస్ వాసులను హమాస్ విడిచిపెట్టాల్సి ఉన్నప్పటికీ బందీల్లో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారు. వారందరినీ విడుదల చేసిన హమాస్ త్వరలోనే తక్కిన 28 మంది మృతదేహాలను కూడా అప్పగించనుంది.
The post PM Narendra Modi: గాజా నుంచి ఇజ్రాయెల్ బందీల విడుదలను స్వాగతించిన మోదీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
