భోజ్‌పురి సూపర్ స్టార్ పవన్ సింగ్… ఆయన భార్య జ్యోతీ సింగ్ ల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తన భర్త స్త్రీ లోలుడంటూ జ్యోతీ సంచలన కామెంట్లు చేశారు. గృహ హింస కారణంగా నరకం చూస్తున్నానంటూ బాంబ్ పేల్చింది. పవన్ సింగ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బిహార్ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇలాంటి సమయంలో జ్యోతీ సింగ్ రాజకీయ రంగ ప్రవేశానికి సర్వం సిద్ధం చేసుకుంది.
వచ్చే నెలలో జరగబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కరకట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. గతంలో కరకట్ లోక్ సభ స్థానానికి పవన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రాజారామ్ సింగ్ కూశ్వాహపై ఓడిపోయారు. ఈసారి పవన్ సింగ్ భార్య కరకట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేస్తోంది. జ్యోతీ సింగ్ తండ్రి రాంబాబు సింగ్ కూతురి రాజకీయ ప్రవేశం ఖాయమైందని నిన్ననే స్పష్టం చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘జ్యోతీ సింగ్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుంది?.. ఏ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తుంది? లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుందా?.. అన్నది త్వరలో డిసైడ్ అవుతుంది. ప్రజలు జ్యోతిని కరకట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని అడుగుతున్నారు. ఆ ప్రాంత ప్రజలతో జ్యోతీకి మంచి బంధం ఉంది’ అని అన్నారు. పవన్, జ్యోతీల గొడవ గురించీ ఆయన మాట్లాడారు. ‘నా కూతురితో కలిసి ఉండమని పవన్ ను చాలా బతిమాలాను. కానీ, అతడు మాత్రం విడాకులు కావాలంటున్నాడు. అధికారికంగా విడాకులు వచ్చే వరకు తన భర్తతో ఉండే హక్కు నా కూతురికి ఉంది’ అని అన్నారు.
జన్ సురాజ్ రెండో లిస్ట్ విడుదల
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల రెండో విడత జాబితాను ‘జన్ సురాజ్’ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ సోమవారంనాడు విడుదల చేశారు. 65 మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో ఈసారి కూడా ఆయన పేరు చోటుచేసుకోలేదు. రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు పోటీగా ప్రశాంత్ కిశోర్ నిలబడతారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు కంచుకోటగా పేరున్న హర్నాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కమలేశ్ పాశ్వాన్‌ను జన సురాజ్ పార్టీ బరిలోకి దింపింది. రెండో విడత జాబితాలో 20 రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు (10 ఎస్సీ, ఒక ఎస్టీ), 46 అన్ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఎన్నికల్లో పోటీచేసే 116 మంది అభ్యర్థులను ఇంతవరకూ ప్రకటించామని, త్వరలోనే తక్కిన అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని ప్రశాంత్ కిశోర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రకటించిన అభ్యర్థుల్లో 31 మంది బాగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, 21 మంది ఇతర వెనుకబడిన తరగతుల వారు, 21 మంది ముస్లింలు ఉన్నారని తెలిపారు. దీనికి ముందు అక్టోబర్ 9న 51 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రశాంత్ కిశోర్ విడుదల చేశారు. వీరిలో కేద్ర మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ కుమార్ లతా సింగ్, లెజెండ్రీ సోషలిస్ట్ నేత కర్పూరీ ఠాకూర్ మనుమరాలు జాగృతి ఠాకూర్, ప్రముఖ బోజ్‌పురి గాయకురాలు రితీష్ పాండే, ప్రముఖ గణితశాస్త్రవేత్త కేసీ సిన్హా ఉన్నారు.
త్రిముఖ పోటీ
ఈ ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. ఎన్డీయే, ‘ఇండియా’ కూటమి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని చెబుతున్నప్పటికీ ‘జన్ సురాజ్’ పార్టీ సైతం ఎన్నికల ఫలితాలపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 74 సీట్లతో ఆ తర్వాత స్థానంలో నిలిచింది. ఈసారి ప్రశాంత్ కిశోర్ జన్‌సురాజ్ తోడవడంతో పోటీ గట్టిగా ఉండొచ్చని, ప్రభుత్వ ఏర్పాటులో చిన్న పార్టీలు, కొత్త నేతల ప్రభావం గణనీయంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎన్డీయేకు అసెంబ్లీలో 131 సీట్ల బలం (బీజేపీ-80, జేడీయూ 45, హెచ్ఏఎం-4, ఇద్దరు ఇండిపెండెంట్లు) ఉండగా, విపక్ష మహాకూటమికి 111 సీట్ల బలం (ఆర్జేడీ-77, కాంగ్రెస్-19, సీపీఐఎంఎల్-11, సీపీఎం-2 సీపీఐ-2) ఉంది.
The post Jyoti Singh: బిహార్ ఎన్నికల బరిలో స్టార్ హీరో భార్య appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
