కాలవ్యవధి అంతటా కచ్చితమైన రాబడులు
ముంబై, అక్టోబర్ 15 : ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC).. బుధవారం రెండు సరికొత్త బీమా పాలసీలను (LIC Plans) పరిచయం చేసింది. కంపెనీ సీఈవో, ఎండీ ఆర్ దొరైస్వామి చేతులమీదుగా జన్ సురక్ష (యూఐఎన్: 512ఎన్388వీ01), బీమా లక్ష్మి (యూఐఎన్: 512ఎన్389వీ01) ప్లాన్లను ప్రారంభించింది. బీమాపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎత్తివేసిన తర్వాత ఎల్ఐసీ నుంచి వచ్చిన పథకాలు ఇవే కావడం గమనార్హం. కాగా, ప్రస్తుతం మార్కెట్లో వడ్డీరేట్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న నేపథ్యంలో పాలసీదారులకు కాలవ్యవధి మొత్తంగా నమ్మకమైన రాబడులను అందించేలా ఈ ప్లాన్లను ఎల్ఐసీ రూపొందించడం విశేషం. ఇక ఈ రెండు ప్లాన్లలోనూ పూర్తిగా మూడేండ్లపాటు ప్రీమియంలను చెల్లించినైట్టెతే ఆటో కవరేజీ సదుపాయం కూడా ఉన్నది. ఎల్ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటన ఆధారంగా పాలసీల వివరాల్లోకి వెళ్తే..
జన్ సురక్ష-ప్లాన్ (880)
ఇది నాన్-పార్టిసిపేటెడ్, నాన్-లింక్డ్ ఇండివీడ్యువల్ సేవింగ్స్ లైఫ్ మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్.
అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా రూపొందించారు.
18-55 ఏండ్ల వయసువారు అర్హులు.
ఒక్కో పాలసీదారునికి కనీస బీమా లక్ష రూపాయలు, గరిష్ఠ బీమా రూ.2 లక్షలు.
పాలసీ కాలవ్యవధి 12 నుంచి 20 ఏండ్లు.
కాలవ్యవధి అంతటా ప్రతీ ఏడాది ముగింపులో వార్షిక ప్రీమియంలో 4 శాతాన్ని గ్యారంటీడ్ ఆడిషన్గా పొందవచ్చు.
బీమా సమయంలో పాలసీదారుడు దురదృష్టవశాత్తు చనిపోతే కుటుంబానికి ఆర్థిక దన్నుగా ఈ ఇన్సూరెన్స్ నిలుస్తుంది.
కాలపరిమితి ముగిస్తే పాలసీదారునికి లంప్సం నగదు మొత్తాలు అందుతాయి.
నిబంధనలకు లోబడి ఎటువంటి వైద్య పరీక్షల అవసరం లేకుండానే పాలసీదారులు బీమా తీసుకోవచ్చు.
బీమా లక్ష్మి-ప్లాన్ (881)
ఇదో నాన్-పార్టిసిపేటెడ్, నాన్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్.
ప్రత్యేకంగా మహిళల కోసమే ఈ పాలసీ.
18-50 ఏండ్ల వయసువారు అర్హులు.
ఒక్కో పాలసీదారుకు కనీస బీమా రూ.2 లక్షలు. నిబంధనలకు లోబడి గరిష్ఠంగా ఎంతైనా బీమా తీసుకోవచ్చు.
పాలసీ కాలవ్యవధి 25 ఏండ్లు.
ప్రీమియం చెల్లించే కాలం 7 నుంచి 15 ఏండ్లు.
పాలసీదారు ఇష్టప్రకారం ప్రతీ రెండేండ్లు లేదా నాలుగేండ్లు లేదా ప్రీమియం చెల్లింపు ముగిశాక పీరియాడికల్ ఫిక్స్డ్ మనీ బ్యాక్ సౌకర్యం.
పరిమిత స్థాయిలో చిన్నచిన్న ఆరోగ్య సమస్యలున్నా మహిళలకు లైఫ్ కవరేజీ.
ఆకర్షణీయమైన, కచ్చితమైన మెచ్యూరిటీ ప్రయోజనాలూ లభిస్తాయి.
ఇన్-ఫోర్స్ పాలసీలు, పెయిడ్-అప్ పాలసీల కోసం ఏటా ట్యాబులర్ వార్షిక ప్రీమియం మొత్తాల్లో 7 శాతాన్ని గ్యారంటీడ్ ఆడిషన్.
అదనంగా ప్రీమియంలు చెల్లిస్తే రైడర్ల సదుపాయం కూడా ఉంటుంది. నిబంధనలకు లోబడి తీవ్ర అనారోగ్య సమస్యలున్నా వర్తిస్తుంది.
మరిన్ని వివరాల కోసం www.licindia.inలోగల సేల్స్ బ్రోచర్‌ను పరిశీలించవచ్చు.
