బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆర్జేడీ (RJD) నేత తేజస్వి యాదవ్ రఘోపూర్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీకి బుధవారంనాడు నామినేషన్ వేశారు. వైశాలి జిల్లా హజీపూర్‌లోని కలెక్టరేట్ కార్యాలయంలో తేజస్వి(35) నామినేషన్ వేశారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి హాజరయ్యారు. తేజస్వి యాదవ్ రఘోపూర్ నుంచి వరుసగా రెండుసార్లు గెలిచారు. హ్యాట్రిక్ గెలుపును ఆశిస్తున్నారు. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీహార్‌ను అభ్యుదయపథంలోకి తీసుకువెళ్లాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇంటింటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం
నామినేషన్ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ… రఘోపూర్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి రెండుసార్లు గెలిపించారని, మూడోసారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తాము సంకల్పించామని, బిహార్‌లో నిరుద్యోగితను నిర్మూలిస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రాన్ని అభ్యుదయం వైపు నడిపించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రెండు సీట్లలో పోటీ చేస్తానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అయితే తాను రాష్ట్రంలోని 243 సీట్లకు పోటీ చేస్తున్నానని నవ్వుతూ చెప్పారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ జేడీయూపై తేజస్వి విమర్శలు గుప్పించారు. జేడీయూను లలన్ సింగ్, సంజయ్ ఝా, విజయ్ చౌదరి నడిపిస్తున్నారని, నితీష్‌తో జేడీయూ ఎంతమాత్రం లేదని తేజస్వి చెప్పారు. ఆ ముగ్గురు నేతలు పార్టీని బీజేపీకి అమ్మేశారని, నితీష్ కుమార్‌ను దెబ్బతీసారని ఆరోపించారు.
లాలూ, రబ్రీని గెలిపించిన రఘోపూర్
రఘోపూర్ నియోజకవర్గం నుంచి ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి గతంలో ఎన్నికయ్యారు. బిహార్ ముఖ్యమంత్రులుగా కూడా వారు బాధ్యతలు నిర్వహించారు. కాగా, తేజస్వి మూడోసారి రఘోపూర్ నుంచి నామినేషన్ వేయడంతో ఆయన సన్నిహితులతో పాటు, కుటుంబ సభ్యులు మిసా భారతి (పాటలీ పుత్ర ఎంపీ, పెద్ద సోదరి), రాజ్యసభ సభ్యుడు సంజయ్ యాదవ్ కూడా హాజరయ్యారు. తేజస్వి నామినేషన్ వేసే ముందు పాట్నాలోని లాలూ ఇంటి నుంచి హజీపూర్ సబ్ డివిజన్ కార్యాలయం వరకూ 40 కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు.
అలీనగర్ బీజేపీ అభ్యర్ధిగా సింగర్ మైథిలీ ఠాకూర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను భారతీయ జనతా పార్టీ (BJP) బుధవారంనాడు విడుదల చేసింది. 12 మంది అభ్యర్థులు, వారు పోటీ చేసే నియోజకవర్గాలను తాజాగా ప్రకటించింది. ఈసారి టెక్కెట్ దక్కిన వారిలో ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్, మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా తదితరులు ఉన్నారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి మైథిలీ ఠాకూర్ పోటీ చేయనుండగా, బక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా పోటీ చేస్తారు.
బిహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందిన మైథిలీ ఠాకూర్ ఇటీవల బీజేపీలో చేరారు. అవకాశం వస్తే తన సొంత నియోజకవర్గం నుంచి బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని చెప్పారు. మైథిలీ ఠాకూర్‌ను బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా కూడా ఎన్నికల కమిషన్ గతంలో నియమించింది. రాష్ట్రానికి సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. క్లాసికల్, ఫోక్ సంగీతంలో శిక్షణ పొందిన ఆమెకు బిహార్ ఫోక్ మ్యూజిక్‌కు చేసిన సేవలకు సంగీత నాటక అకాడమీ 2021లో ఉస్తాద్ బిస్మిల్మా ఖాన్ యువ పురస్కారం అందజేసింది.
కాగా, మైథిలీ ఠాకూర్‌తో పాటు మరో మహిళా అభ్యర్థి ఛోటీ కుమారికి ఛాప్రా సీటును బీజేపీ కేటాయించింది. బీజేపీ మొత్తం 101 స్థానాలకు గాను ఇంతరకూ 83 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. సోమవారంనాడు తొలి జాబితాలో 71 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.
The post Tejashwi Yadav: అట్టహాసంగా నామినేషన్ వేసిన తేజస్వి యాదవ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
